America | న్యూఢిల్లీ, అక్టోబర్ 17: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటు దళాలపై ఇప్పటివరకు సాధారణ ఫైటర్ జెట్లను వాడిన అమెరికా, అత్యంత భీకరమైన అడ్వాన్స్డ్ ‘బీ-2’ స్టెల్త్ బాంబర్స్‌ను రంగంలోకి దింపింది. బుధవారం సాయంత్రం నుంచి యెమెన్‌లో హౌతీ తిరుగుబాటు దళాల స్థావరాలపై బీ-2 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
హౌతీ ఆయుధ డిపోలు లక్ష్యంగా బీ-2 స్టెల్త్ బాంబర్స్ దాడులు గురువారం కూడా కొనసాగాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దళాలకు చెందిన ఐదు అండర్‌గ్రౌండ్ ఆయుధ స్థావరాల్ని నామరూపాల్లేకుండా చేసినట్టు అమెరికా రక్షణ మంత్రి లాయిండ్ ఆస్టిన్ స్వయంగా తెలిపారు.
అత్యంత భారీ విధ్వంసాన్ని సృష్టించే బాంబులను ప్రయోగించటం, సుదూర లక్ష్యాలను చేధించటం ‘బీ-2’ బాంబర్ల ప్రత్యేకత. దాదాపు ఒక బిలియన్ డాలర్ విలువజేసే (రూ.8వేల కోట్లు) అడ్వాన్స్డ్ బీ-2 యుద్ధ విమానాలను యెమెన్ యుద్ధంలో అమెరికా వాడటం ఇదే మొదటిసారి.