తాండూరు, జనవరి 5: ఒక వైపు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక వినియోగానికి అనుమతులు ఇవ్వని మండల రెవిన్యూ అధికారులు అక్రమంగా ఇసుకను తరలించే వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారని యాలాల తహసిల్ధార్ కార్యాలయం ఎదుట పలువురు లబ్ధిదారులు సోమ వారం నిరసనకు దిగారు. అక్రమార్కులను ప్రోత్సహించేలా అధికారుల వైఖరి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని నిరసనకు దిగిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
ఒక వైపు తమకు నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వకుండా వేధిస్తూ 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న బషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయం నుండి అనుమతులు తెచ్చుకోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రెవెన్యూ అధికారులపై ఇందిరమ్మ ఇండ్ల లభ్ధిదారులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమకు అనుమతులు ఇవ్వని అధికారులకు కాక్రవేణి వాగులో ఇసుకను అక్రమంగా నాలుగు ట్రాక్టర్లలో నింపుతున్నారని ఫిర్యాదు చేస్తే కూత వేటు దూరంలోని వాగుకు వెళ్లి ట్రాక్టర్లను సీజ్ చేయకుండా మిన్నకుండిపోయారని వారు వెల్లడించారు. ఈ విషయమై తాము 100కు డయల్ చేస్తే స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి సోమ వారం కాక్రవేణి వాగులో ఇసుక అక్రమంగా రెండు ట్రాక్టర్లలో లోడ్ చేస్తుండగా వాటికి అనుమతులు లేక పోవడంతో పట్టుకుని కేసులు నమోదు చేశారని అన్నారు. ఇలా స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారులు అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
ప్రజల ఫిర్యాదుతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న
రెండు ట్రాక్టర్లను సీజ్ చేసిన స్పెషల్ పోలీసులు
యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామం వద్ద ఉన్న కాక్రవేణి వాగులో అక్రమంగా ఇసుకను లోడ్ చేస్నున్న నాలుగు ట్రాక్టర్లను గుర్తించిన స్థానికులు ముందుగా స్థానిక పోలీసులకు, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఎంతకూ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్ని గంటలపాటు ఎదురు చూసినా స్థానిక అధికారులు స్పందించకపోడంతో 100కు వారు డయల్ చేశారు. దీంతో స్ఫెషల్ పార్టీ పోలీసులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లలో రెండింటిని సీజ్ చేసి యాలాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.