హమాస్‌ను శిక్షించే పేరుతో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 22 నెలలు కావస్తున్నది. ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు గానీ 20 లక్షల మంది గాజావాసులు మాత్రం నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా జరుపుతున్న దాడులతో ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం అన్ని హద్దులూ దాటిపోయిందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినవారి సంఖ్య 60 వేలు దాటడం ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేస్తున్నది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నపిల్లలే కావడం మరీ దారుణం. ఆకాశం నుంచి కురుస్తున్న అగ్నిగోళాలతో బూడిదకుప్పగా మారిన గాజాలో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. పోషకాహార లోపంతో చిక్కిశల్యమైన పసివాళ్ల ఫొటోలు హృదయాలు ద్రవింపజేస్తున్నాయి. తల్లులు పిల్లలకు పాలసీసాల్లో ఉత్త నీళ్లు పడుతున్నారంటే అక్కడ ఎంతటి దీనస్థితి నెలకొన్నదో తెలుస్తున్నది.
సుమారు రెండేండ్లుగా గాజా ఆహార కొరతను ఎదుర్కొంటున్నది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం చేస్తుండటం వల్ల ఆహార పదార్థాలు బాధితులకు చేరుకోవడం గగనమవుతున్నది. ఫలితంగా పోషకాహార లోపం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 74 ఆకలిచావులు సంభవిస్తే అందులో 63 ఒక్క జూలైలోనే జరిగాయి. మృతుల్లో 24 మంది ఐదేండ్ల లోపు పసిపిల్లలు కావడం విషాదకరం. గాజాలో ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారి సంఖ్య కేవలం రెండు నెలల్లోనే మూడింతలు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. గాజాలో ఆహార సమస్య సంక్షోభంగా మారుతున్నదని ఇది సూచిస్తున్నది. ప్రపంచదేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఇజ్రాయెల్ సహాయ బృందాలపైనా దాడులు జరుపుతుండటం తీవ్రమైన మానవీయ సంక్షోభానికి దారితీసింది. తక్షణం చర్యలు చేపట్టకపోతే పెద్దఎత్తున ఆకలిచావులు తప్పవని ఐరాస అత్యవసర సహాయ విభాగం అధిపతి కీత్ ఫ్లెచర్ ఒక నివేదికలో హెచ్చరించడం గమనార్హం.
ఐరాస అధికారికంగా క్షామాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ‘అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న మొండివైఖరి ఫలితంగా నేడు గాజాలో కృత్రిమ క్షామం నెలకొన్నదన్నది వాస్తవం. ప్రపంచ దేశాలు పంపిస్తున్న మానవతా సాయం సరిహద్దుల్లో మురుగుతుంటే, అటు గాజా పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. హమాస్ పాలన స్థిరపడుతుందనే సాకుతో ఇజ్రాయెల్ ఆహార పదార్థాల సరఫరాను అడ్డుకుంటుండటం విడ్డూరం. ఇన్నాళ్లూ ఆహార కొరత లేదన్నట్టుగా వ్యవహరించిన ఇజ్రాయెల్ ‘కొంత మేర’ ఆకలి సమస్య ఉన్నట్టు అంగీకరించడం మరీ విడ్డూరం. అంతర్జాతీయంగా విమర్శలు అధికం కావడంతో ఇజ్రాయెల్ దాడులకు రోజువారీగా పరిమిత విరామం అమలు చేయనున్నట్టు ప్రకటించింది. అది ‘సంపూర్ణ విరామం’గా ఎప్పుడు మారుతుందా? అని ప్రపంచం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నది.