Bodhan | బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాకాసిపేట్లోని బూత్ నంబర్ 24, గోశాల ప్రాంతంలోని బూత్ నంబర్ 78లో వేరే వాళ్ల పేర్లతో ఓటు వేసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అయితే ఓటర్ గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న సమయంలో తప్పుడు గుర్తింపు పత్రాలను చూపించారు. ఈ క్రమంలో వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది నిలదీయడంతో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినట్లుగా వెల్లడించారు. దీంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ సంబంధిత చట్టాలపై సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతరుల ఓట్లను వేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.