LLSVPS | న్యూఢిల్లీ : ఎవరెస్ట్ శిఖరం కన్నా 100 రెట్లు ఎత్తయిన రెండు భారీ నిర్మాణాలు భూమి కింద ఉన్నాయి. అవి ఎలా ఏర్పడ్డాయి? అనే వివరాలు శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. మేరీలాండ్ విశ్వవిద్యాలయం జియాలజిస్ట్ వేద్ లెకీ తెలిపిన వివరాల ప్రకారం, ఓ ఖండం అంత పెద్ద పరిమాణం గల ఈ శిలా రూపాలను బ్లాబ్స్ అంటారు. ఇవి తమ చుట్టూ ఉన్న ప్రాంతం కన్నా భిన్నమైనవి. వీటి గుండా ప్రయాణించే భూకంప తరంగాల వేగం తగ్గుతున్నట్లు గుర్తించారు.
అందుకే వీటిని లార్జ్ లో షియర్ వెలాసిటీ ప్రావిన్సెస్ (LLSVPS) అని పిలుస్తున్నారు. ఇవి భూమిలోని ఇతర ప్రాంతాల కన్నా భిన్నమైనవని చెప్పడానికి ఇది సంకేతం. వీటి గురించి 1970వ దశకంలో తెలుసుకున్నప్పటికీ, మరిన్ని వివరాలను తెలుసుకోలేకపోతున్నారు. భూమి ఉపరితలం నుంచి వేలాది మైళ్ల కింద నుంచి ఇవి ప్రారంభమైనట్లు మాత్రం గుర్తించారు. ఇవి పసిఫిక్ మహాసముద్రం, ఆఫ్రికా ఖండం, అట్లాంటిక్ల కింద ఉన్నాయి. ఒకవేళ ఇవి భూమిపైకి వస్తే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కక్ష్యను చేరుకోగలవు! భూమిపై జరిగే పరిణామాలపై వీటి ప్రభావం ఏమిటో కూడా తెలియదు.