అమరావతి : తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఇద్దరు జవాన్లు గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. రాడార్ సెంటర్లో చింతామణి అనే జవాన్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చింతామణి 2021లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో కానిస్టేబుల్‌గా ఎంపికై శ్రీహరి కోటలోని యూనిట్లో చేరాడు.
ఇటీవల నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవు అనంతరం ఈనెల 10న తిరిగి విధుల్లో చేరాడు. ఈనెల15న రాత్రి అత్యవసర భద్రత దళం పెట్రోలింగ్ చేస్తూ చెట్టుకు వేలాడుతున్న చింతామణి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూంలో సి-షిప్ట్‌లో విధుల్లో ఉన్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్ తన వద్ద ఉన్న పిస్తోలుతో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం అంతరిక్ష కేంద్రంలో కలవరం మొదలైంది.
అయితే వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు మొదలు పెట్టారు. జవాన్ల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.