Israel : ఇజ్రాయెల్‌లో భారతీయులపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇజ్రాయెల్‌లోని గాజా సరిహద్దు, అష్కెలాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రిపూట ఈ ఘటన జరిగింది. ఇద్దరు భారతీయ కార్మికులు స్తానికంగా పని చేస్తున్నారు. వారు పని ముగించుకుని వెళ్తుండగా, కొందరు ఇజ్రాయెల్‌కు చెందిన దుండగులు వారిని ఫాలో అవుతూ వెళ్లారు. అనంతరం ఒక పార్కులోకి చేరుకోగానే, అక్కడ ఆ ఇద్దరిపై దాడి చేశారు.
ఉన్నట్లుండి, విచక్షణారహితంగా దాడి చేశారు. అలాగే వారి దగ్గర నుంచి నగదు వంటివి దోపిడీకి ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధితుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. కానీ, దీనిపై ఫిర్యాదు అందుకున్న ఇజ్రాయెల్ పోలీసులు దాడికి పాల్పడ్డవారిలో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. వారిద్దరూ 19 ఏళ్లలోపు వారే. ఇది జాత్యాహంకార దాడి అని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు.. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా జోక్యం చేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను పవన్ ఖేరా కోరారు. బాధితులకు తగిన చికిత్స అందించాలని సూచించారు. అలాగే త్వరలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారని, ఈ సందర్భంగా భారతీయ కార్మికులపై దాడి, వారి భద్రత గురించి మోదీ చర్చలు జరపాలని పవన్ ఖేరా కోరారు.
Yesterday, two Indian citizens were brutally attacked in Ashkelon, Israel.
It was a premeditated racist assault, planned over private chats. This is not the first such attack. And sadly, it may not be the last.
The government’s failure to generate adequate employment at home… pic.twitter.com/ZPFYcrrfj1
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) February 18, 2026
ఇక.. తాజా ఘటనలో నిందితులు ప్రీ ప్లాన్డ్‌గానే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇజ్రాయెల్‌లో విదేశీయులపై ఎక్కువగా దాడులు జరుగుతుంటాయి. వారిని సులభంగా టార్గెట్ చేయొచ్చన్నది అక్కడి వారి నమ్మకం. ఇజ్రాయెల్‌కు భారతీయులు ఉపాధి కోసం ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ వేతనాలు ఎక్కువగా ఉండటం, ఆ దేశం భారతీయులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన కార్మికులు అక్కడికి వెళ్లి పని చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత పాలస్తీనియన్లను పనుల్లోకి తీసుకోవడం లేదు. దీంతో భారతీయులు తమ లైఫ్ రిస్క్ చేసుకుని మరీ ఇజ్రాయెల్‌లో పని చేస్తున్నారు.