న్యూఢిల్లీ: సింగపూర్‌లోని హోటల్లో సెక్స్ వర్కర్లపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు భారతీయ టూరిస్టు(Indian Tourists)లకు జైలుశిక్ష పడింది. దాడితో పాటు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరికీ అయిదేళ్ల శిక్ష ఖరారు చేశారు. దీంతో పాటు ఒక్కొక్కరికి 12 లాఠీబెబ్బల శిక్ష కూడా వేశారు. నిందితులను 23 ఏళ్ల అరక్కొయిసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మైలరసన్‌గా గుర్తించారు. ఆ ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. ఏప్రిల్ 24వ తేదీన సింగపూర్‌కు ఆ ఇద్దరూ చేరుకున్నారు. రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ఏరియాలో వాకింగ్‌కు వెళ్లారు.
ఓ అపరిచిత వ్యక్తి వారి వద్దకు వచ్చి వేశ్యలు ఉన్నట్లు చెప్పాడు. ఇద్దరు మహిళలకు చెందిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్లాడు. అయితే ప్లాన్ ప్రకారం ఇద్దరూ ఆ మహిళలను రూమ్‌కు పిలిచి వాళ్ల వద్ద నుంచి డబ్బులు లాగేసుకున్నారు. సెక్స్ వర్కర్లను దుస్తులతో రూమ్‌లో కట్టేసి, వారి నుంచి జ్వలరీ, 2000 సింగపూర్ డాలర్ల నగదు, పాస్ పోర్టు, బ్యాంక్ కార్డులు లాగేసుకున్నారు. మరో రోజు మరో మహిళతో రాత్రిపూట ఓ హోటల్లో కలిశారు. ఇద్దరు కలిసి ఆ మహిళ నుంచి నగదు, మొబైల్ ఫోన్లు లాక్కెళ్లారు. పోలీసులు నిందితులను పట్టుకుని కోర్టుకు అప్పగించారు.