వేములవాడ/కథలాపూర్, నవంబర్ 13:‘బీసీల వ్యతిరేకి బీజేపీ. ఆ పార్టీకి బిల్డప్ ఎకువ, పని తకువ. బీసీ మహిళకు టికెట్ ఇచ్చి గుంజుకోవడం, ఆఖరి నిమిషంలో బీఫాం మరొకరికి ఇచ్చి అవమానించడం చాలా బాధాకరం. సీనియర్ నాయకురాలు తుల ఉమకకు అన్యాయం జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తుల ఉమను గులాబీ పార్టీలోకి ఆహ్వానించి, మాట్లాడారు. ఆమె మా ఇంటి బిడ్డగా తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆమెకు గతంలో ఉన్న హోదాకంటే మరింత సమున్నత హోదాను ఇచ్చి పార్టీ గౌరవించుకుంటుందని, అందుకు సంబంధించిన బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని స్పష్టం చేశారు.
బీజేపీకి బిల్డప్ ఎకువ, పని తకువ అన్నట్లుగా బీసీ మహిళకు టికెట్ ఇచ్చి గుంజుకోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్, ప్రస్తుత బీజేపీ సీనియర్ నాయకురాలు తుల ఉమ సోమవారం మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అనంతరం తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులు బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, బీఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరమన్నారు. ఇది మహిళలకే కాకుండా బీసీలపై బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ, బీసీ మహిళపై వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు.
ఉద్యమ కాలం నుంచి సీనియర్ మహిళా నాయకురాలుగా, నాడు సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా, తెలంగాణ ఆడ బిడ్డగా, బీఆర్ఎస్ ఇంటిబిడ్డగా సేవలందించిన తుల ఉమకకు బీజేపీలో ఇలా అవమానం జరగడం బాధగా ఉందన్నారు. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం తెలియజేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు స్వయంగా తానే ఉమకకు ఫోన్ చేసి ఆహ్వానించానని, మా ఇంటి ఆడబిడ్డగా గులాబీ గూటికి తిరిగి చేరుకోవాలనే తన ఆహ్వానాన్ని మన్నించి రావడం సంతోషంగా ఉందన్నారు. తుల ఉమకకు గతంలో ఉన్న హోదాకంటే మరింత సమున్నత హోదాను, బాధ్యతలను అప్పగించి పార్టీ గౌరవించుకుంటుందని, ఇందుకు సంబంధించిన బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధత కలిగిన సైనికురాలిగా ఎలాంటి కల్మశం లేకుండా కలిసి పనిచేసిన తుల ఉమతో అంతే నిబద్ధతతో తిరిగి కలిసి పనిచేస్తామని చెప్పారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతికోసం సేవలు అవసరమన్నారు. గతంలో కూడా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళా అభ్యున్నతి కోసం కృషిచేసిన తుల ఉమకకు పుట్టిన గూటికి పునఃస్వాగతం అని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.
సొంత గూటికి ఉద్యమ నాయకురాలు ఉమ
తుల ఉమ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేశారు. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. 2010-15 దాకా బీఆర్ఎస్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా, 2015-2021 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014లో కథలాపూర్ జడ్పీటీసీగా గెలిచారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో 2019 దాకా పనిచేశారు. అంతకుముందు బీడీ కార్మిక నాయకురాలిగా పనిచేశారు. జూన్ 14, 2021లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అదే పార్టీలో ఉన్న ఆమెను, ఈ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో బీ ఫాం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందారు. సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. మధ్యా హ్నం వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతో కలిసి హైదరాబాద్ వెళ్లి మంత్రి కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు.
బీజేపీని నమ్మితే మిగిలేది ఏమీ ఉండదు
బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి ఇచ్చారు. బీజేపీలో బీసీని సీఎం చేయడం అనేది ఒక కలే. అందుకు నేనే ఉదాహరణ. ఆ పార్టీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. బీజేపీ అంటేనే అగ్రవర్ణాల పార్టీ. కిందిస్థాయి కార్యకర్తలను వాడుకోవడమే వారి లక్ష్యం. గతం లో బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉండి అనేక పదవుల్లో పనిచేశా. ఈ పార్టీలో మాత్రం ఆ గౌరవం దకలేదు. బీజేపీ కార్యకర్తలారా దయచేసి వినండి. ఆ పార్టీని నమ్ముకుంటే మిగిలేది ఏమీ ఉండదు. ఇప్పటికైనా తేరుకోవాలి. నా రాజకీయ జీవితంలో మధ్యలో కొద్దిగా సమస్య వచ్చినప్పటికీ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నది. నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉన్నది. మరింత ఉత్సాహంగా పనిచేస్తా. ప్రజలతో మమేకమై ముందుకుసాగుతా.
– బీఆర్ఎస్లో చేరిన అనంతరం ఉమ