తిరుపతి : తరిగొండ వెంగమాంబ (Tarigonda Vengamamba) సాహిత్యం, రచనలు, కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ కృషి చేస్తుందని టీటీడీ (TTD) జేఈవో గౌతమి (JEO Gauthami) తెలిపారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ శ్రీవారిపై భక్తి శ్రద్ధలతో అనేక సంకీర్తనలు రచించారన్నారు. తన రచనల ద్వారా భావితరాలకు ఎనలేని సాహిత్య సంపదను అందించిందని ఉద్గాటించారు. అనంతరం జరిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన అనంతపురం ఎస్కె వర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ కుసుమకుమారి మాట్లాడుతూ వెంగమాంబ ఎన్నో రచనలు చేసినా ఆమె రచనలకు గుర్తింపు రాలేదన్నారు. టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆమె సాహిత్యాన్ని, రచనలను వెలుగులోకి తీసుకొని వచ్చిందని చెప్పారు. సంఘసంస్కర్తగా, భక్తిని ఆయుధంగా చేసుకొని ఎన్నో రచనలు చేశారని వివరించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాకటర్ సాయికృష్ణ యాచేంద్ర “తరిగొండ వెంగమాంబ -జీవన గానం ” అనే అంశంపై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా జనరంజకమైన భాషలో వెంగమాంబ రచనలు చేశారని తెలిపారు. వెంగమాంబ పాటలు సామాన్య జనులు పాడుకునే విధంగా వుంటాయన్నారు. ప్రతి పాటలో భక్తి, చైతన్య వంతమైన భావాలు కనిపిస్తాయన్నారు. అంతకుముందు శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు.