Tirumala | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న గరుడ వాహనసేవను తిలకించేందుకు వచ్చిన భక్తులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మాఢవీధుల్లోని గ్యాలరీలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్డులో కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. ప్రైవేటు వాహనాలను అనుమతించమని స్పష్టం చేసింది. మొదటి ఘాట్ రోడ్డులో మాత్రం ద్విచక్రవాహనాలకు మినహా అన్ని వాహనాలకు అనుమతిని ఇచ్చింది. సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ విగ్రహం వరకు రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వాహనాలకు అనుమతి నిరాకరించడంతో బస్సులు ఎక్కేందుకు భక్తులు ఎగబడుతున్నారు. అలాగే అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి కొండపైకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు.
గరుడ వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు ఎలాంటి అవంతరాలు కలగకుండా ఉండేందుకు నాలుగు మాడవీధుల్లో పర్యవేక్షణకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది ప్రత్యేక అధికారులను నియమించారు.