TSUTF : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవంలో ఉపాధ్యాయులను ఉద్ధేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని టీఎస్‌యూటీఎఫ్(TSUTF) అధ్యక్షులు ఎ. వెంకటి, ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. ఉపాధ్యాయుల పండుగ రోజు వరాలు కురిపించి మురిపిస్తారని ఆశించిన ఉపాధ్యాయులకు సీఎం ఆశాభంగం కలిగించారని వీరు మండిపడ్డారు.
మూడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, ఐదు డిఏలు ప్రకటించి మన్ననలు పొందాల్సిన సమయంలో.. ఉద్యోగుల పోరాటాలను ముఖ్యమంత్రి చులకనగా చూశారని, ఇంకా రెండేళ్ళు ఓపికపట్టమనడం చాలా విచిత్రంగా ఉందని వెంటకి తెలిపారు. మూడేళ్ళ ఆలస్యానికి కారణాలు చెప్పకుండా.. సీఎం దాటవేసే ధోరణిని అవలంబించారని రవి పేర్కొన్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటాలు చేసేవారిని చర్చలకు పిలవకుండా, పోరాటంతో సంబంధం లేని వ్యక్తులను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడటం ద్వారా తన రాజనీతిజ్ఞత ప్రదర్శించారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు ఎ. వెంకటి తెలిపారు. ఇప్ప్పుడు బలంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీని బలహీనపరచే ఎత్తుగడలో భాగంగానే సీఎం అలా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కానీ కిందిస్థాయి ఉద్యోగులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని, పైగా వారిలో మరింత పోరాట కసి పెర్గిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని తాము కోరుతున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి మాటల వల్ల తమ ప్రభుత్వమే అప్రతిష్ట పాలవుతున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నట్టు చెప్పారు.
ఏది ఏమైనా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పీఆర్సీ, డిఏ ఇవ్వకుండా పోరాటం విరమించేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నామని ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. నాయకులుగా పోరాటాలు నిలిపివేయాలని నిర్ణయించినా సరే కింది స్థాయి క్యాడర్ మాత్రం నాయకత్వాలను తిరస్కరించి పోరాటాలకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాంటి పరిస్థితులువస్తే టియస్‌యుటిఎఫ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పక్షాన పోరాటం చేపడుతుందని వారికి భరోసానిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైన ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఉద్యోగుల డిమాండ్లను నేరవేర్చి ఆందోళనను విరమించేలాచేయాలని కోరుతున్నాం అని రవి తెలిపారు.