TSA Srikanth Yadav | సికింద్రాబాద్, ఫిబ్రవరి10: ప్రభుత్వ రంగ సంస్థల్లో అక్రమంగా కొనసాగుతున్న 1050 మంది రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పదేండ్లుగా దాదాపు 1050 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఉన్నత పదవులు, శాఖాధిపతులుగా, ఇతర ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని ఆరోపించారు. వీరికి వేతనాలతోపాటు అలవెన్స్‌లు ఇతరత్రా రూపాల్లో ఏటా రూ.కోట్లల్లో ప్రజాధనం కేటాయించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కకుండానే రిటైర్ అవ్వాల్సిన దుస్థితి నెలకొనడంతోపాటు నిరుద్యోగ యువకులకు కూడా నష్టం జరుగుతుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలిగించి సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పిస్తామని, అలా ఏర్పడిన ఖాళీలను ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలైనా కూడా నేటికి ఆయన హామీ అమలుకు నోచుకోలేదన్నారు.
ఒకవైపు నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుండగా, రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం పెన్షన్‌తో పాటు అక్రమంగా జీతాలు, అలవెన్స్‌లు పొందుతున్నారని శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి వెంటనే వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల నిరుద్యోగులను, ఉద్యోగులను కలుపుకుని మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎ నాయకులు రామ్ కిషన్, మురళి కృష్ణ, రంజిత్ వర్మ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.