TS Weather | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదైంది. గడిచిన 24గంటల్లో నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్ వివరించింది.