ఉత్తర తెలంగాణ దివ్యధామంగా కరీంనగర్లో టీటీడీ ఆలయం
నగరం మధ్యలో పది ఎకరాలు కేటాయించిన సీఎం కేసీఆర్
స్థలం కోసం విశేష కృషిచేసిన మంత్రి గంగుల కమలాకర్
వినోద్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు, జీవీ భాస్కర్‌రావుల కృషితో టీటీడీ ఆమోదం
మంత్రి గంగులకు స్థలపత్రాలు అందజేసిన కేసీఆర్
ఏడాదిన్నరలోగా భక్తులకు దేవదేవుని ఆశీస్సులు
టీటీడీకి, సీఎంకు మంత్రి గంగుల కృతజ్ఞతలు
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) / కరీంనగర్ కార్పొరేషన్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కరీంనగర్‌కు తరలిరానున్నారు. నగరం నడి బొడ్డులో తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పదెకరాల భూమిని కేటాయించారు. మంగళవారం ఈ స్థలానికి సంబంధించిన అనుమతి పత్రాలను మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జీవీ భాస్కర్‌రావు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి కరీంనగరం నగరంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీనివాసుని ఆలయం సీఎం సంకల్పంతో ఏడాదిన్నర కాలంలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
తిరుమలకు ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి వైభవం ప్రతిబింబించేలా అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గుండవరం వెంకటభాస్కర్‌రావు కృషితో ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డితోపాటు సభ్యుల ఆమోదం లభించిందని తెలిపారు.
ఇందుకు కృషి చేసినవారికి, టీటీడీ పాలకమండలికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయాల పునరుద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాల నిర్వహణతో సీఎం కేసీఆర్ సారథ్యంతో ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని కొనియాడారు. ఏడాదిన్నరలోపు కరీంనగర్ శ్రీనివాసుని ఆలయంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని భక్తులకు భగవంతుడు మరింత చేరువవుతాడని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు పాల్గొన్నారు.