ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
మాదాపూర్, అక్టోబర్ 16: టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లపై శనివారం పలువురు ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించి, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. ఈ నెల 25న ప్లీనరీ నేపథ్యంలో హాజరుకానున్న ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మూడు రోజుల క్రితం మాదాపూర్ హైటెక్స్‌ను పరిశీలించిన పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో చెవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్తోపాటు ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్లీనరీకి రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 4 వేల వాహనాల్లో 14 వేల మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. వారికి పార్కింగ్, ప్లీనరీకి వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా తగిన చర్యలు తీసుకునేలా కమిటీ సభ్యులతో కలిసి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.