హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నవభారతానికి టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేదిక నాంది పలికింది. దేశానికి గోల్డెన్ తెలంగాణ మాడల్ కావాలని ఆకాంక్షించింది. హెచ్ఐసీసీ వేదికగా జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సంబురాలు అంబరాన్ని అంటాయి. సభలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకబిగిన తొమ్మిదిన్నర గంటలపాటు 13 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సభలో 13 తీర్మానాలను ఆమోదించారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. తెలంగాణ తల్లికి పూలాభిషేకం చేశారు. ఆ తరువాత పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. సీఎం ప్రసంగిస్తుండగా సభికులు పెద్దపెట్టున ‘దేశ్‌కీ నేతా కేసీఆర్.. జై తెలంగాణ’ అంటూ నినాదాలు.. హర్షద్వానాలు చేశారు.
ఈలలు చప్పట్లతో సభా ప్రాంగణమంతా మారుమోగింది. సమావేశ ప్రాంగణాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు మంత్రి కేటీఆర్.. రెండు మూడు సార్లు జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో 60లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీగానే కాకుండా తమది దాదాపు రూ. 1000 కోట్ల ఆస్తులున్న పార్టీ అని, వచ్చే ఎన్నికల్లో 90 పైచిలుకు సీట్లు సాధించబోతున్నామని కేసీఆర్ చేసిన ప్రకటన పార్టీ శ్రేణుల్లో కొండంత సంబురాన్ని నింపింది. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టారు. పార్టీ సీనియర్ నాయకురాలు మూల విజయ వీరతిలకం దిద్దారు.
ప్లీనరీలో అసాధారణ ఏర్పాట్లు చేశారు. 33 వంటకాలతో పసందైన భోజనం అందించారు. మంచినీళ్లు.. మజ్జిగ కూర్చొన్నచోటుకే తెచ్చి ఇచ్చారు. సాయంత్రం సర్వపిండి.. పల్లి, నువ్వుల లడ్డు అందజేశారు. టీఆర్ఎస్ వాలంటీర్ దళం ఏర్పాట్ల పర్యవేక్షణ, సమన్వయానికి దాదాపు 100 వాకీటాకీలను, 200 సీసీ కెమెరాలను వినియోగించారు. ప్లీనరీకి వచ్చిన వారికి పార్టీ తీర్మానాల పుస్తకం, పార్టీ జెండా, కండువా, విసనకర్ర, షెల్ల, మాస్క్, శానిటైజర్‌తో కూడిన బ్యాగ్ అందజేశారు.
ఈ ప్లీనరీలో సభా వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓవైపు సీఎం కేసీఆర్ చిరునవ్వుల చిత్రపటం.. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉంచారు. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను పెట్టారు. సమావేశ మందిరంలో ఎక్కడ కూర్చున్నా అందరికీ వక్తల ప్రసంగాలు కనిపించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్ రాసిన ‘ఆరోహణ’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ప్లీనరీ వేదికపై ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురు గౌరీశంకర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన అనుగుల పద్మ 30 పాటలతో టీఆర్ఎస్ పార్టీపై రూపొందించిన సీడీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌కు పలువురి సన్మానం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు శాలువా కప్పి,శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ సారు,
తెలంగాణ ఉద్యమంలో ఆనాడు చురుగ్గా పాల్గొని, ఉద్యమానికి దశ, దిశ చూపించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, నీటిపారుదల రంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావులను కేసీఆర్ స్మరించుకున్నారు. టీఆర్ఎస్లో భాగమైనందుకు గర్వంగా ఉన్నది టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామం, వార్డులు, బస్తీల్లో పార్టీ జెండాను ఉత్సాహంగా ఎగురవేసి, ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పార్టీని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ట్విటర్లో ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందుకు రెండు దశాబ్దాల క్రితం మా నాయకుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆందోళనల నుంచి పరిపాలన వరకు టీఆర్ఎస్ స్ఫూర్తిదాయక ప్రయాణంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉన్నది. టీఆర్ఎస్ 21 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా పార్టీ నాయకులు, సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’అని ట్వీట్ చేశారు.
టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చర్యలతో పంటలు పుష్కలంగా పండుతుండటంతో రైతులు గులాబీ జెండాకు జై కొడుతున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండి తండాలో గిరిజనులు తమ పొలంలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి సంబురాలు జరుపుకొన్నారు.
– సంస్థాన్ నారాయణపురం