హైదరాబాద్, జనవరి 29 : రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో మూడు దశాబ్దాల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ కేసు నేటికీ మానని గాయంగానే మిగిలిపోయింది. ఆ గాయం బాధితులను ఇంకా వేధిస్తూనే ఉన్నది. ఈ వేదనను భరించలేక ఓ బాధితురాలు శనివారం ఏకంగా అజ్మీర్ కోర్టులోనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘30 ఏండ్లు అయ్యింది. ఇంకా నన్ను పదే పదే కోర్టుకు ఎందుకు పిలుస్తున్నారు? ఇప్పుడు నేను గ్రాండ్మదర్ని. నన్ను వదిలేయండి. మాకు కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకి నేను ఏమని సమాధానం చెప్పాలి’ అని న్యాయమూర్తిని, న్యాయవాదులను ఆ బాధితురాలు నిలదీయడంతో న్యాయస్థానమంతా ఒక్కసారిగా మూగబోయిందని సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి యాదవ్ ట్వీట్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మహిళలకు సత్వర న్యాయాలు చేసే చట్టాలు కావాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ట్వీట్ చేశారు. ‘1992 నాటి అజ్మీర్ రేప్ కేసు బాధితులకు 30 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదు. మహిళలకు సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని కలిగించే చట్టాలు, విధానాలను రూపొందించాలని నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్లో తెలిపారు.