వనపర్తి : బీజేపీ నాయకుడి కుమార్తె వివాహం ఇటీవలే జరగ్గా.. ఆ కుటుంబానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మున్సిపాలిటీ కౌన్సిలర్ భరత్ భూషణ్(బీజేపీ) కుమార్తె వివాహం ఇటీవలే జరిగింది. అయితే ఆ కుటుంబం కల్యాణలక్ష్మి పథకానికి అర్హత కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న కల్యాణలక్ష్మి చెక్కును ఇవాళ భరత్ భూషణ్ సతీమణి హైమావతికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.