హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో దళితులకు న్యాయం జరగలేదనే సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం చర్చ లేవనెత్తారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే కేసీఆర్ ప్రతిపాదనపై పార్లమెంట్లో చర్చించాలని సవాల్ విసిరారు. అంబేద్కర్ను రకరకాలుగా అవమానించిన వారే ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులకు మేలు జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమన్నారు.
కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాకోణంలో పని చేస్తున్నారు. రాజ్యాంగ విలువలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని బాలరాజు స్పష్టం చేశారు. కేసీఆర్ అన్ని ఆలోచించే మాట్లాడుతారు. అవగాహన లేని వారే కేసీఆర్ను విమర్శిస్తారు అని ఆయన ధ్వజమెత్తారు. రాజ్యాంగ విలువలకు లోబడే కేసీఆర్ మాట్లాడారని స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరచాలన్నారు. ఇతర దేశాల్లో అవసరాన్ని బట్టి తమ తమ రాజ్యాంగాలను మార్చుకున్నారని గువ్వల బాలరాజు గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చినా అంబేద్కర్ పేరు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు సుస్థిరంగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు రూపుమాపే ఎలాంటి చర్యలను కేసీఆర్ ఆమోదించరు. రాజ్యాంగంలో గట్టి చట్టాలు ఉంటేనే దేశంలో అనుకున్న మార్పు సాధ్యమని కేసీఆర్ గట్టిగా నమ్ముతారు అని గువ్వల బాలరాజు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు కేసీఆర్ సిద్ధం
ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కొత్త రాజ్యాంగంపై అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాలకు చేతనైతే కొత్త రాజ్యాంగంపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలను అడ్డుకుంటాం అని గువ్వల బాలరాజు హెచ్చరించారు.