హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో తెలంగాణ భాగం కాదా? అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీజేపీ నాయకత్వాన్ని నిలదీశారు. పంజాబ్‌లో వరి ధాన్యం సేకరిస్తూ, తెలంగాణలో సేకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగంతో చెలగాటం ఆడుతున్నదని ఈ సందర్భంగా మండిపడ్డారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో తాను విసిరిన సవాల్‌కు తోకముడిచిన బీజేపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కేలేదని ఆయన తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వమన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ఏ రైతును అడిగినా తమది రైతు ప్రభుత్వమని చెప్తారని, ఈ సంగతి తెలియక బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ది రైతు ప్రభుత్వమని, తెలంగాణ రైతు రాష్ట్రమనే సత్యాన్ని ప్రపంచమే గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు.
బాధ్యతాయుతమైన సీఎం కేసీఆర్‌ను దళారీలతో బీజేపీ నేతలు పోల్చటాన్ని నిరంజన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ప్రధాని మోదీ గతంలో గుజరాత్‌కు సీఎంగా పనిచేశారని, అదే విధంగా దేశంలో ప్రస్తుతం 19 రాష్ర్టాల్లో బీజేపీ నేతలే సీఎంలుగా ఉన్నారన్న మంత్రి.. ప్రధాని సహా బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులూ దళారీలేనా? అని ప్రశ్నించారు.
దేశంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) నిర్ణయించేది కేంద్రమేనన్న సోయి కూడా బీజేపీ నేతలకు లేకపోవడం దురదృష్టకరమని నిరంజన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉమ్మడి జాబితాలో ఆర్టికల్ 246 ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులపై కనీస ధర నిర్ణయించే అధికారం కేంద్రానిదేనని గుర్తుచేశారు. దేశానికి అన్నంపెట్టే రైతులను, వ్యవసాయ వృత్తిని వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక అంశంగా పరిగణించి, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం కేంద్రానిదేనని, రాష్ర్టాలకు ఎటువంటి ప్రమేయం లేదని అందులో చెప్పిన విషయాన్ని బీజేపీ నేతలు చదువుకోవాలని హితవు పలికారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కనీస అవగాహన, ప్రణాళికే లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. వానకాలం పంట ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫాలుగా కేంద్రాన్ని సంప్రదిస్తున్నా, వరి సేకరణలో పట్టింపు లేకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 63 లక్షల ఎకరాల్లో వరి పండుతున్నదని వ్యవసాయ రికార్డులను కేంద్రానికి నివేదిస్తే వాటిపై ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఒక్క గింజకూడా సేకరించేదిలేదని చేతులేత్తేసిన ఎఫ్‌సీఐ.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదా? కేంద్రం పరిధిలో ఉన్నదా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. వానకాలం పంట విషయంలో రాష్ట్ర రైతాంగం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పునరుద్ఘాటించారు. పంజాబ్‌లో పండించిన వరిని సేకరిస్తూ తెలంగాణలో ఎందుకు సేకరించరని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో తెలంగాణ భాగం కాదా? అని ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాది రాష్ర్టాలకు ఒక విధానం.. దక్షిణాది రాష్ర్టాలకు మరో విధానమా? దక్షిణాది రాష్ర్టాలు కరువుతో అల్లాడి కంట్రోల్ బియ్యం తినాలా?’ అని నిప్పులు చెరిగారు. జాతీయ పార్టీ అని చెప్పుకొనే బీజేపీ సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు.
హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల ఎన్నికల కోడ్ ఉల్లఘించారని నిరంజన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్నికల నియమావళిని అనుసరించి 48 గంటల ముందు ఎటువంటి ప్రెస్మీట్లు పెట్టకూడదని ఉన్నా దాన్ని అతిక్రమించి ఈటల హనుమకొండలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు వస్తే ఈసీ అడ్డుకున్నదని, పోలీసులు కాదని స్పష్టం చేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీకి తమ పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘాన్ని నిర్దేశించే అధికారం, అవకాశమే ఉంటే తమ పార్టీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు పోలీసులను నిలువరించేవాళ్లం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ధర్నా చేయటాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు మళ్లీ ఒక్కటి కావాలని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై షర్మిల తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా.. అన్నిటికన్నా మించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడైన సీఎం కేసీఆర్‌పై షర్మిల ఏకవచన సంబోధమే కాకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తాము ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో.. తన వ్యాఖ్యలతో మనోభావాలు గాయపడ్డాయని షర్మిల భావిస్తే విచారం వ్యక్తం చేయటానికి తాను వెనుకాడనని చెప్పారు.
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటలకు ఉచిత విద్యుత్తు అందిస్తూ సీఎం కేసీఆర్ రైతును రాజు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటను కొనుగోలు చేసిన రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ తప్ప మరొకటి లేదని ఆయన చెప్పారు. రైతు కష్టాలు తెలుసు కనుకనే కరోనా సమయంలోనూ రైతుల్ని తమ మానాన వదిలిపెడితే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరి చెప్తే తామేం చేయాలో అది చేస్తామని అన్నారు.