హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణభవన్‌లో సంబురాలు మిన్నంటాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణభవన్ కోలాహలంగా మారింది. డప్పు చప్పుళ్లతో మార్మోగింది. టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
తెలంగాణ భవన్లో జరిగిన సంబురాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ నేతలు నాయినేని రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌంటింగ్ కేంద్రం వద్ద విజేత, టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డిని పార్టీ కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాకులు కాల్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని, సంబురాలు చేసుకున్నారు.
అనంతరం యాదవరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీఎమ్మెస్ చైర్మన్ శివకుమార్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాతా మధు గెలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నల్లగొండ జిల్లాలో కౌంటింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పటాకులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కోటిరెడ్డికి స్వీటు తినిపించి, శాలువా కప్పి సన్మానించారు.