అశ్వారావుపేట, జూన్ 10 : తమ భూములు సర్వే చేసి అప్పగించే వరకు నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని ఆదివాసులు స్పష్టం చేశారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు సర్వేనెంబర్ 30, 36, 39 లలో రెవిన్యూ శాఖ తమకు పట్టాలి ఇచ్చిన భూమిని అటవీ శాఖ అధికారులు ఆక్రమించుకున్నారని, వెంటనే వాటిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు అశ్వరావుపేట తాసిల్దార్, అటవీశాఖ కార్యాలయల ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజు చేరాయి. ఈ సందర్భంగా ఆదివాసీలు నల్ల రిబ్బన్లతో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
కొన్నేళ్లుగా భూముల కోసం ఉద్యమాలు చేస్తున్నామని అయినా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆదివాసీ నాయకులు మనకు నాగేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే హైకోర్టు, జిల్లా కలెక్టర్ భూములు సర్వే చేసి అప్పగించాలని ఆదేశించిన అధికారులలో చలనం కనిపించడం లేదని మండిపడ్డారు. గతంలో పాదయాత్ర చేపట్టినప్పుడు అధికారులు భూములు అప్పగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
కొన్ని నెలలపాటు వేచి చూసిన అధికారులు సమస్య పరిష్కరించటం లేదని, దీనిపై మరోసారి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని ఈనెల 5వ తేదీని అధికారులకు వినతి పత్రం ఇచ్చామని వివరించారు. 8వ తారీకు దాకా గడువు ఇచ్చామని, 9వ తేదీన సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళన చేపడతామని వినతి పత్రంలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మా భూముల కోసం నిరోధక నిరాహారదీక్ష చేపట్టినట్లు తెలిపారు.