Hyderabad Metro | సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): మెట్రోతో మన యాత్రి యాప్ జట్టు కట్టింది. నగరంలోని 57 మెట్రో స్టేషన్ల చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మెట్రో ప్రయాణికులు చేరుకునేలా మన యాత్రి ఓపెన్ మొబిలిటీ యాప్ సేవలను అందించనుంది. కారు, ఆటో రిక్షాల ద్వారా తమ నివాసాలు, కార్యాలయాల నుంచి మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు మన యాత్రి యాప్లో బుక్ చేసుకుంటే వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. టీ హబ్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మన యాత్రి ఓపెన్ మొబిలిటీ యాప్ ఎల్ అండ్ టీ మెట్రో హైదరాబాద్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నారు.
మెట్రో రైల్ వ్యూహాత్మకంగా ముందుకు..: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నగర ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో మెట్రో రైలు సంస్థ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తున్న మెట్రో రైలులో లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా మన యాత్రి యాప్ నుంచి కారు, ఆటోలను బుకింగ్ చేసుకోవడం ద్వారా సులభంగా మెట్రో స్టేషన్లకు చేరుకోవచ్చు.
మరింతగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ: ఎల్ అండ్ టీ మెట్రో సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డి
మన యాత్రితో భాగస్వామ్యం ద్వారా మెట్రో ప్రయాణికుల కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. మెట్రో ప్రయాణికుల అవసరాలను గుర్తించి, వాటిని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎల్ అండ్ టీ, మెట్రో రైలు సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా మన యాత్రి యాప్ సేవలు లక్షలాది మంది నగరవాసుల ప్రయాణాన్ని సులభం చేస్తుంది.
రాయితీతో కూడిన ధర: మన యాత్రి కో ఫౌండర్, సీఈఓ మజిగన్ సెల్వన్ మన యాత్రి యాప్లో ఆటోను బుక్ చేసుకుంటే రాయితీతో కూడిన ధర రూ.40 నుంచి ప్రారంభమవుతుందని, సమీప మెట్రో స్టేషన్లకు సులభంగా, వేగంగా చేరుకోవచ్చు.