చాందిని ఓ ట్రాన్స్‌జెండర్. వయసు యాభై రెండు. బెంగళూరులోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్. ఆమెకొక తీరని కోరిక ఉంది. అప్సరసలా ఫొటో షూట్ చేయించుకోవాలని కోరిక. తమిళనాడుకు చెందిన పింకీకి నటి హేమమాలిని అంటే ఇష్టం. ఆమెలా భరతనాట్యం చేయాలని ఆశ. ఎవరికైనా చెబితే నవ్వుకుంటారేమోనన్న జంకు. ఫొటోగ్రాఫర్ జైసింగ్ నాగేశ్వరన్కు వీరి కోరిక తెలిసింది. ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్న ‘ట్రూత్ డ్రీమ్ ప్రాజెక్ట్’ సాయం తీసుకున్నాడు. అలాంటివారిని ఒకచోట చేర్చి అద్భుతమైన ఫొటో షూట్ చేశాడు. అప్సర, మోహిని, శకుంతల, హేమమాలిని.. ఇలా తమకు నచ్చిన ముస్తాబుతో కెమెరా ముందు నిలబడ్డారు ఎంతోమంది. వాటిని జైసింగ్ ఓ ఎగ్జిబిషన్లో ప్రదర్శించాడు. తిలకించిన వారంతా ‘అద్భుతః’ అంటూ ఫొటోగ్రాఫర్‌ను, ట్రాన్స్జెండర్లను అభినందించారు.