చార్మినార్ : హైదనాబాద్లో విషాదం (Tragedy) చోటు చేసుకుంది. మూగ జీవాలకు ఆహారం అందించడానికి వెళ్లిన ఇద్దరు సోదరులు ( Two Brothers ) మృత్యువాత పడిన ఘటన రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. రెయిన్ బజార్ పరిధిలోని నివసించే షాబుద్దీన్ (26) , ఫైజాన్ (21), బక్రీద్ (Bakrid ) పండుగ సందర్భంగా ముందస్తుగా వారి కుటుంబం మేకలను కొనుగోళ్లు చేసింది. వాటికీ ఆహారాన్ని అందించడానికి ఇద్దరు సోదరులు సోమవారం ఇంటికి సమీపంలోని యాకుత్‌పుర రైల్వేస్టేషన్ రైలు పట్టల వద్దకు చేరుకున్నారు.
మేకల కోసం కనిపించిన గడ్డిని సేకరిస్తూ అందులో లీనమై పోయారు. అంతలోనే యాకుత్ పుర స్టేషన్ మీదుగా ప్రయాణిస్తున్న రైలు సమీపంలోకి వచ్చిన సోదరులు గుర్తించలేక పోయారు. దీనితో రైలు ఇద్దరిని ఢీ (Train accident) కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న యాకుత్ పుర ఎమ్మెల్యే జాఫర్ మేరాజ్ హుస్సేన్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.