మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాద ఘటన జరిగింది. జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీలో( ACC quarry pond) స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన పట్టణంలోని జాఫర్‌నగర్‌కు చెందిన సాధుల హర్షవర్ధన్ (15) స్నానం కోసం వెళ్లి క్వారీ మడుగులోకి దిగి మునిగి ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం సాయివర్ధన్ స్నేహితులతో కలసి మడుగులోకి దిగాడు.
దిగినవారందరూ బయటకు రాగా సాయివర్ధన్ లోతులోకి వెళ్లడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు అక్కడినుంచి వారివారి ఇంటికి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి ప్రసాద్ కొడుకు రాత్రి 8 దాటిన ఇంకా ఇంటికి రాకపోవడంతో స్నేహితుల వద్ద ఆరా తీయగా రాత్రి 10 గంటలకు క్వారీ వద్ద స్కూటీ, మడుగు పక్కన బట్టలు, చెప్పులు కనిపించాయి. తండ్రి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బుధవారం ఘటన స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు.
పదో తరగతి పూర్తి చేసుకుని రేపు హైదరాబాదులో ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ కోసం హాస్టల్‌కు వెళ్లే సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి, సాయి వర్ధన్ తండ్రి ప్రసాద్ పెద్దపల్లి లోని యాక్సిస్ బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా , తల్లి లావణ్య కోటపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై సీహెచ్.తిరుపతి తెలిపారు.