ముంబై, ఏప్రిల్ 13: ఎలక్ట్రిక్ వాహనాలతో (ఈవీలు) భారీ వాణిజ్యవకాశాలు ఏర్పడతాయని దేశీ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. ఈవీల సంబంధిత కార్యకలాపాల ద్వారా వచ్చే ఐదేండ్లలో రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు క్రిసిల్ పేర్కొంది. 2026వ సంవత్సరానికల్లా ఇందులో వివిధ ఈవీలను తయారుచేసే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎంలు) రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుందని, రూ. 90,000 కోట్ల వరకూ వాహన ఫైనాన్సింగ్ సంస్థలు వ్యాపారం చేస్తాయని, మిగిలిన మొత్తం వాణిజ్యం షేర్డ్ మొబిలిటీ, ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా జరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ విశ్లేషణలో వివరించింది. ప్రభుత్వ మద్దతుతో పాటు వినియోగదారులు ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాల నుంచి ఈవీలపైపు మొగ్గుచూపనున్నందున ఈ పరిశ్రమ భారీగా వృద్ధి చెందుతున్నది.
రానున్న సంవత్సరాల్లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల శాతం క్రమేపీ పెరుగుతుందని ఈ సందర్భంగా క్రిసిల్ అంచనా వేసింది. సంస్థ అంచనాల ప్రకారం 2026కల్లా వాహన విక్రయాల్లో 15 శాతం ఎలక్ట్రిక్ టూవీలర్లు, 25-30 శాతం ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 5 శాతం కార్లు, బస్సులు ఆక్రమిస్తాయని తేలింది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22) రిజిష్టర్ అయిన మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు 5 శాతానికి పెరగ్గా, ఈ-టూవీలర్లు 2 శాతానికి, ఈ-కార్లు, బస్సులు 4 శాతానికి పెరగడం గమనార్హం. సబ్సిడీ లేకపోయినా కూడా 2026కల్లా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీవీలర్ల అమ్మకాలు బాగా పెరుగుతాయని, ఐసీఈ వాహనాల నిర్వహణా వ్యయం అధికంకావడమే ఇందుకు కారణమని క్రిసిల్ డైరెక్టర్ హిమాల్ ఠక్కర్ చెప్పారు. ఈ రంగం వృద్ధిచెందుతూ ఉంటే ఎన్నో కొత్త ట్రెండ్స్, వ్యాపార నమూనాలు ఆవిర్భవిస్తాయని, బ్యాటరీ సర్వీసుల వ్యాపారం, పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు వస్తాయని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.