బ్యాంకాక్: ఆసియాకప్ వరల్డ్ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు దుమ్మురేపారు. వేర్వేరు విభాగాల్లో పది పతకాలతో సత్తాచాటారు. రెండు స్వర్ణాలు సహా, నాలుగు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికిత మరోమారు అదరగొట్టింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకంతో పాటు మహిళల విభాగంలో రజతంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ కాంపౌండ్ ఫైనల్లో టాప్‌సీడ్ చికిత, రజత్ చౌహాన్ ద్వయం 158-156 తేడాతో రెండో సీడ్ మలేషియా జోడీ ఫతిన్ నూర్ఫతె, మహమ్మద్ జువైదీపై ఉత్కంఠ విజయం సాధించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చికిత, చౌహాన్..చెదరని గురితో ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో పైచేయి సాధించారు.
వరుసగా నాలుగుసార్లు చికిత, చౌహాన్ పదేసి పాయింట్లకు గురిపెట్టగా, మలేషియా అంతే దీటుగా స్పందించడంతో ఒక దశలో స్కోరు 118-117కు చేరింది. అయితే ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగిన చికిత, చౌహాన్ నాలుగు పదేసి పాయింట్లతో మ్యాచ్‌ను తమ వశం చేసుకోగా, మలేషియా 39 పాయింట్లకు పరిమితమైంది. అదే జోరు కొనసాగిస్తూ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో చికిత, రాజ్కౌర్, తేజల్ సాల్వె త్రయం 169-171 తేడాతో కజకిస్థాన్ చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. మరోవైపు పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో ఉదయ్ కంబోజ్ 145-144తో భారత్‌కే చెందిన పార్థమేశ్ జవ్కార్పై గెలిచి పసిడి సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో రజత్ చౌహాన్‌కు కాంస్యం దక్కడంతో భారత్ పోడియం ఫినిష్ చేసింది. మహిళల కాంపాండ్ వ్యక్తిగత విభాగంలో తేజల్ సాల్వె 144-135తో దిమిదుక్(రష్యా)పై గెలిచి కాంస్యం ఖాతాలో వేసుకుంది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో రిధికి రజతం దక్కింది.