Tongue Color | మన శరీరంలో ఏదైనా సమస్య ప్రారంభమైతే ముందుగా కొన్ని చిన్న సంకేతాల రూపంలో కనిపిస్తుంది. ఇలా సంకేతాలను చూపించే వాటిలో నాలుక కూడా ఒక ముఖ్యమైన సూచికగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నాలుక రంగు, పైపొర, ఆకారం, మచ్చలు వంటి మార్పులు శరీర ఆరోగ్య పరిస్థితిపై సంకేతాలు ఇవ్వగలవని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేసే ఈ మార్పులు కొన్నిసార్లు పోషకాహార లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన నాలుక సాధారణంగా లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇది సరైన పోషకాహారం, తగినంత నీరు తీసుకోవడం, మంచి నోటి పరిశుభ్రతను సూచిస్తుంది. పలుచని తెల్లటి పొర ఉండటం సహజమని నిపుణులు చెబుతున్నారు.
నాలుక చాలా పలుచగా లేదా తెల్లగా కనిపిస్తే అది ఐరన్ లోపం, విటమిన్ బి12 కొరత లేదా రక్తహీనతకు సంకేతం కావచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక అలసట లేదా శరీరంలో శక్తి లోపాన్ని కూడా ఇది సూచిస్తుందని చెబుతున్నారు. నాలుకపై మందమైన తెల్లని పొర కనిపిస్తే అది నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, డీహైడ్రేషన్, ధూమపానం వంటి కారణాలతో అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఐరన్ లేదా విటమిన్ బి12 లోపం వంటి సమస్యలకు కూడా ఇది సంకేతం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. నాలుకపై పసుపు రంగు పొర కనిపించడం సాధారణంగా మృత కణాలు, బ్యాక్టీరియా లేదా ఆహార అవశేషాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఇది ఎక్కువగా తాత్కాలికమే అయినప్పటికీ, కొన్నిసార్లు జీర్ణ సమస్యలు లేదా జాండిస్ వంటి సమస్యలకు కూడా సూచనగా భావించాలి.
అలాగే నాలుక గాఢ ఎరుపు లేదా స్ట్రాబెర్రీ రంగులో కనిపిస్తే అది విటమిన్ బి12 లోపం లేదా వాపుకు సంకేతం అవుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా స్కార్లెట్ ఫీవర్, కవాసాకి వ్యాధి వంటి సమస్యల్లో కూడా ఇలా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతమందిలో నాలుకపై మ్యాప్‌లా కనిపించే ఎర్రని మచ్చలు ఉంటాయి. దీనిని జియోగ్రాఫిక్ టంగ్ అని అంటారు. ఇది సాధారణంగా హానికరం కాదు, అంటువ్యాధి కూడా కాదు. అయితే ఒత్తిడి, విటమిన్ లోపాలు లేదా సోరియాసిస్ వంటి సమస్యలతో ఇది సంబంధం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నిపుణుల సూచనల ప్రకారం, నాలుకలో అసాధారణ మార్పులు కొన్ని రోజులకు మించి కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. సరైన నోటి పరిశుభ్రత, సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ద్వారా నాలుక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.