రేపు కృష్ణా జలాల పంపిణీ అంశాలపై వివరణ…
జనవరి 6న స్వయం ప్రకటిత సాగునీటి మేధావి వెదిరె శ్రీరాం గోదావరి, కృష్ణా జలాలపై రెండవసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి హైదరాబాద్ తరలివచ్చాడు. జనవరి 3న కాంగ్రెస్ మోసాలను, అబద్ధాలను, వక్రీకరణలను తన్నీరు హరీశ్‌రావు బట్టబయలు చేయగానే వారి రక్షణకు దిగిపోయి తన ప్రజెంటేషన్‌లో కేసీఆర్ మీద విమర్శలు గుప్పించాడు. జనవరి 2న రాష్ట్ర అసెంబ్లీలో నీళ్ల మంత్రి, ముఖ్యమంత్రి ఏ అబద్ధాలను చెప్పారో, ఏ రకమైన వక్రీకరణలు చేశారో మక్కికి మక్కీ అవే అబద్ధాలు, అవే వక్రీకరణలు ఈయన గారు కూడా దాచేశారు. జనవరి 7న పత్రికల్లో అచ్చయిన వార్తల ప్రకారం… ఈయన చేసిన విమర్శల్లో కొన్ని ప్రధానమైనవి ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
ఇచ్చంపల్లి, కంతనపల్లి, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టులు చేపట్టకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం: వెదిరె శ్రీరాంకు తొలినాళ్ల నుంచి ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఒక బలమైన కోరిక ఉన్నది. 2018లో వరంగల్‌లో జరిగిన ఒక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ చేసిన ప్రతిపాదనలను నాటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతకుముందే గోదావరి జలాల వినియోగంపై ఆయన ఖరీదైన ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. తను చేసిన ప్రతిపాదనలను కేసీఆర్ పట్టించుకోలేదన్న అక్కసు ఆయనను ఆనాటి నుంచి నేటివరకూ వెంటాడుతూ ఉన్నట్టు కనబడుతున్నది. సరే, వ్యక్తిగత అక్కసు సంగతి పక్కనబెట్టి ఆయన చేసిన అసంబద్ధ ప్రతిపాదనలను మొదట విశ్లేషిద్దాం. వరంగల్ సదస్సులో తను రాసిన పుస్తకంలో గోదావరి జలాల వినియోగంపై చేసిన అనేక విలువైన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని, కాళేశ్వ రం ప్రాజెక్టు బ్యారేజీని 115 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మిస్తే 85 టీఎంసీల నీటిని నిల్వ చేసి మొత్తంగా ఏడాదిలో 350 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు, కానీ ప్రభుత్వం మగ్గులో నుంచి బకెట్లోకి నీరు తోడిపోస్తున్న చందంగా ఉన్నదని, తక్కువ సామర్థ్యంతో కాళేశ్వరం బ్యారేజీ నిర్మించి 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోయడం వింతగా ఉన్నదని ఆ యన ఆనాడు ఎద్దేవా చేస్తూ మాట్లాడినట్టు పత్రికలు ప్రచురించాయి.
పత్రికల్లో వచ్చిన వార్తలు ఎట్లున్నా, గోదావరి జలాల వినియోగంపై శ్రీరాం రాసిన పుస్తకంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రదేశానికి దిగువన కాళేశ్వరం వద్ద ఒక మేజర్ డ్యాం 115 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మాణం జరగాలని ప్రతిపాదించారు. ఆయన తన పుస్తకంలో 135 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద 350 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఒక పెద్ద డ్యాం నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. 135 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ నుంచి 115 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వరకు ముంపు, నిల్వ సామర్థ్యాల పట్టిక కూడా సమకూర్చారు.
ఇచ్చంపల్లి వద్ద భారీ ముంపు కారణంగా మేజర్ డ్యాం సాకారం కాలేకపోయిందని శ్రీరాంకు తెలుసు. ఆ ఎత్తులో మేజర్ డ్యాం ప్రతిపాదన సమంజసం కాదని ఆఖరికి 115 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో 85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అయినా కాళేశ్వరం వద్ద డ్యాం నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్ష. 115 మీటర్ల వద్ద ముంపు తెలంగాణలో 216 చదరపు కిలో మీటర్లు (53,352 ఎకరాలు), మహారాష్ట్రలో 113 చ.కి.మీ. (27,911 ఎకరాలు), మొత్తం 329 చ.కి.మీ. (81,263 ఎకరాలు) విస్తీర్ణంలో ముంపు ఉంటుందని అంచనా వేశారు. (మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో సేకరించవలసిన భూమి 55,800 ఎకరాలు) తెలంగాణలో మంథని, మహదేవపూర్, చెన్నూర్, కాళేశ్వరం దేవాలయం, మహారాష్ట్రలో సిరొంచా పట్టణాలు ముంపులోకి రావని పేర్కొన్నారు. ఇది పూర్తిగా సత్యదూరం. సాగునీటి శాఖ ఇంజినీర్ల అధ్యయనం ప్రకారం 115 మీటర్ల కాంటూర్ లైన్ కాళేశ్వరం దేవాలయం మెట్ల వరకు వస్తుంది. గుడి మాత్రమే ముంపులో ఉండదు. మిగతా పట్టణం అంతా ముంపులో ఉంటుంది.
మహారాష్ట్రలో తాలూకా కేంద్రమైన సిరొంచా పట్టణం చుట్టూ నీరు నిలిచి ఉంటుంది. నిజాం జమానాలో గుట్టపై కట్టిన గెస్ట్‌హౌజ్ తప్ప ఏదీ మిగలదు. మహదేవపూర్, మంథని పట్టణాల దగ్గరికి నీరు వస్తుంది. చెన్నూర్ పట్టణానికి ముంపు బెడద తప్పదు. ఇక పూర్తిగా ముంపునకు గురయ్యే గ్రామాలు తెలంగాణలో 51, మహారాష్ట్రలో 21, పాక్షికంగా ముంపునకు గురయ్యే గ్రామాలు తెలంగాణలో 20, మహారాష్ట్రలో 31, ఊళ్లు మిగిలి భూములు మాత్రమే ముంపు బారిన పడుతున్న గ్రామాలు తెలంగాణలో 12, మహారాష్ట్రలో 7. కాళేశ్వరం వద్ద 115 మీటర్ల ఎత్తు వద్ద నిర్మించే డ్యాం వల్ల ప్రభావితమవుతున్న గ్రామాలు తెలంగాణలో 83 అయితే మహారాష్ట్రలో 59. ఇరు రాష్ర్టాల్లో మొత్తం 142 గ్రామాలు ప్రభావితమవుతాయి. ఈ ముంపును మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుతో పోల్చినప్పుడు చాలా చాలా ఎక్కువ. ఇప్పుడున్న కఠినమైన పర్యావరణ, అటవీ చట్టాల నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ముంపుతో ప్రాజెక్టును కట్టడం సాధ్యమేనా? పైగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రాచీన తీర్థ క్షేత్రమైన కాళేశ్వరాన్ని, తాలూకా కేంద్రమైన సిరొంచ పట్టణాన్ని కోల్పోవడానికి తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకొనే అవకాశం ఉంటుందా? దక్షిణ కాశీ కాళేశ్వరాన్ని, తాలూకా కేంద్రం సిరొంచా పట్టణాన్ని ముంచివేసే ఈ అసంబద్ధ ప్రతిపాదనలను పట్టించుకోనందుకు కేసీఆర్ మీద విపరీతమైన అక్కసును పెంచుకున్నాడు.
ఇక మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మిస్తే 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయం ఏర్పడుతుంది. ఈ చిన్న జలాశయం నుంచి 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ జలాశయాన్ని ఎట్లా నింపుతారు? ఇది మగ్గులో నుంచి బకెట్లోకి నీరు తోడిపోస్తున్న చందంగా ఉందని శ్రీరాం ఎద్దేవా చేశారు. 40 ఏండ్ల గోదావరి ప్రవాహాలను పరిశీలిస్తే మేడిగడ్డ వద్ద నుంచి ఏటా సరాసరి 1,650 టీఎంసీల నీరు నికరంగా ప్రవహిస్తున్నదని కేంద్ర జలసంఘం ప్రవాహ లెక్కలే వెల్లడిస్తున్నాయి. జూన్ నుంచి ఫిబ్రవరి దాకా నికరమైన నీటి ప్రవాహాలుంటాయని సీడబ్ల్యూసీ వారి లెక్కలు చెప్తున్నాయి. జూన్‌లో 51, జూలైలో 300, ఆగస్టులో 607, సెప్టెంబర్‌లో 424, అక్టోబర్‌లో 176, నవంబర్‌లో 39, డిసెంబర్లో 17, జనవరిలో 12, ఫిబ్రవరిలో 11 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలుస్తున్నది. ఇంతకంటే ఎక్కువ ప్రవాహాలున్న సంవత్సరాలు కూడా ఉన్నాయి. జూన్‌లో ఒక టీఎంసీ, జూలై నుంచి అక్టోబర్ దాకా రోజుకు 3 టీఎంసీలు తోడుకోవడానికి ఎటువంటి ఇబ్బందుల్లేవు. నవంబర్‌లో ఒక టీఎంసీ, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా అర టీఎంసీ తోడుకోవడానికి గోదావరిలో ప్రవాహాలుంటాయి. గోదావరిలో ఏడాదికి కనీసం 9 నెలలు నీటిని తోడుకోవడానికి ప్రవాహాలుంటాయని సీడబ్ల్యూసీ లెక్కలు నిర్ద్వంద్వ ంగా తేల్చి చెప్తున్నాయి. కాబట్టి మేడిగడ్డ వద్ద 16 టీఎంసీల చిన్న జలాశయం నుంచి కూడా మల్లన్నసాగర్ తదితర జలాశయాలను నింపుకోవడానికి ఉన్న అవకాశాలపై ఎటువంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. నిజానికి మల్లన్నసాగర్‌కు నీరు ఎత్తిపోసేది 27 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న మిడ్ మానేరు జలాశయం నుంచి అన్న సంగతి శ్రీరాం గమనించాలి.
అయితే, సాంకేతికంగా చూసినప్పుడు జలాశయాల నిల్వ సామర్థ్యానికి, నీటి వినియోగానికి పోలిక పెట్టడం అశాస్త్రీయం. ఉదాహరణకు కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు, అక్కడినుంచి తరలించే నీరు 200 టీఎంసీలకు పైనే. గోదావరి నదిపై కాటన్ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు, ఇక్కడినుంచి తరలించే నీరు 200 టీఎంసీలకు పైనే. నదిలో నికరంగా నీటి ప్రవాహాలున్నప్పుడు ఈ బ్యారేజీల నుంచి కాలువలలోకి నీటిని మళ్లించడం సాధ్యమే.
అట్లే గోదావరిలో నికర ప్రవాహాలు ఉంటాయి గనుక 16 టీఎంసీల మేడిగడ్డ జలాశయం నుంచి 200 టీఎంసీల దాకా ఎత్తిపోయడం సాంకేతికంగా అసాధ్యమేమీ కాదు. దానికి ఎక్కువ నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయమే అవసరం లేదు. అయితే, మార్గంలో మాత్రం ఎక్కువ నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు అవసరం. సీడబ్ల్యూసీ కూడా 2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను పరిశీలించిన అనంతరం ఆన్లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకొమ్మని సలహా ఇచ్చింది. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ను నిర్మించింది అందుకే. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సామర్థ్యాన్ని 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచుకోవడం జరిగింది.
16 టీఎంసీల మేడిగడ్డ జలాశయం నుంచి నీటిని ఎత్తిపోయడాన్ని శ్రీరాం మగ్గులో నుంచి బకెట్లోకి ఎత్తిపోయడంగా ఎద్దేవా చేయడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. నాడు చిన్న జలాశయాన్ని నిర్మించడాన్ని ఎద్దేవా చేసిన వీరే, ఎక్కువ సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించినందుకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఘోష్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిండు. ఇదేం రెండు నాలుకల ధోరణి?
ఇకపోతే.. కంతనపల్లి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం నిలిపివేయలేదు. కంతనపల్లి వద్ద బ్యారేజీకి బదులు 20 కిలోమీటర్ల ఎగువన తుపాకులగూడెం వద్ద 83 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద 7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సమ్మక్క బ్యారేజీని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సంగతి శ్రీరాంకు తెలియదా? కంతనపల్లి నుంచి తుపాకులగూడెంకు స్థల మార్పిడి ఎందువల్ల జరిగింది? కంతనపల్లి బ్యారేజీని 85 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద నిర్మించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించారు. ఈ ఎత్తు వద్ద 11 వేల ఎకరాల ఆదివాసీ భూములు, 8 ఆదివాసీ గ్రామాలు పూర్తిగా, 12 గ్రామాలు పాక్షికంగా ముంపు బారిన పడుతున్నాయి.
ఆదివాసీ ప్రజలు ఈ ముంపునకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కనుక ఆదివాసీల భూములను, గ్రామాలను ముంపు నుంచి బయటపడేయడానికి బ్యారేజీ స్థలాన్ని 20 కిలోమీటర్ల ఎగువన 83 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తుపాకులగూడెం వద్దకు మార్చాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నది. బ్యారేజీ ప్రాథమిక లక్ష్యం దేవాదుల ప్రాజెక్టుకు నికరమైన నీటి లభ్యతను కల్పించడం. గంగారం వద్ద నిర్మించిన దేవాదుల పంప్‌హౌజ్‌లోకి నీటిని మళ్లించడానికి గోదావరి నదిలో 71 మీటర్ల ఎత్తు వద్ద ప్రవాహం ఉంటే సరిపోతుంది.
83 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజీ నిర్మాణమైన కారణంగా దేవాదుల ప్రాజెక్టుకు ఏడాదికి నికరంగా 200 రోజులు ఎత్తిపోసుకోవడానికి వెసులుబాటు ఏర్పడింది. అదే సమయంలో ఆదివాసీల భూములు, గ్రామాలు ముంపు నుంచి బయటపడ్డాయి. తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల నది ఒడ్డును ఆనుకొని కేవలం 637 ఎకరాలు మాత్రమే సేకరించింది. ఆదివాసీ గ్రామాలు గాని, భూములు గాని ముంపులోకి రాలేదు. 7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఏర్పడిన సమ్మక్క సాగర్ జలాశయం దేవాదుల ప్రాజెక్టు సాఫల్యతను పెంచింది. దేవాదుల ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాలను నెరవేర్చగలుగుతుంది. ఇది అభినందించదగిన చర్య అయినా ఈ విషయంలో వెదిరె శ్రీరాం కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.
152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంలో ఉన్న ఇబ్బందులను ఇప్పటికే ఎన్నోసార్లు వివరించి ఉన్నాను. తాజాగా 2025, ఏప్రిల్‌లో ప్రచురించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు- విమర్శలు- వక్రీకరణలు- వివరణలు’ అన్న పుస్తకంలో సోదాహరణంగా వివరించాను. 148 మీటర్ల వద్ద కూడా అక్కడ సమస్యలున్న కారణంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపింది. సీడబ్ల్యూసీ అనుమతులను జారీచేయడం కూడా ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదికే 2024 డిసెంబర్లో ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ వచ్చేసింది.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ప్రాణహిత నీటిని తరలించి తీరుతామని ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు అసెంబ్లీ వేదికగా, బయటా ఎన్నోసార్లు ప్రకటనలు చేసి ఉన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి వారిని ఎవరు అడ్డుకున్నారు? రెండేండ్ల తర్వాత కూడా తుమ్మిడిహట్టి బ్యారేజీ వద్ద పనులు ఎందుకు ప్రారంభం కాలేదని, ఎల్లంపల్లికి దాకా గ్రావిటీ కాలువ తవ్వలేదేమని అడగవలసింది ఎవరిని? తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిస్తామని వాగ్దానం చేసి విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్‌ను ఇంకెంత కాలం ఆడిపోసుకుంటారు?
152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంలో ఉన్న ఇబ్బందులను ఇప్పటికే ఎన్నోసార్లు వివరించి ఉన్నాను. తాజాగా 2025, ఏప్రిల్‌లో ప్రచురించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు- విమర్శలు- వక్రీకరణలు- వివరణలు’ అన్న పుస్తకంలో సోదాహరణంగా వివరించాను. 148 మీటర్ల వద్ద కూడా అక్కడ సమస్యలున్న కారణంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపింది. సీడబ్ల్యూసీఅనుమతులను జారీచేయడం కూడా ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదికే 2024 డిసెంబర్లో ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ వచ్చేసింది.
(వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, సాగునీటి శాఖ)
శ్రీధర్‌రావు దేశ్‌పాండే
94910 60585