రాహుల్‌గాంధీని రేవంత్‌రెడ్డి పప్పు కాదు.. ‘ముద్దపప్పు’ అన్నారు. అదే మాటను నేను రిపీట్ చేశాను. సోనియాగాంధీని ‘వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత.. తెలంగాణ పిల్లలను చంపింది’ అని రేవంత్‌రెడ్డి అనడం నిజం కాదా?. గాంధీ కుటుంబంపై రేవంత్ చేసిన దూషణలను మరచిపోయారా? రేవంత్‌ను తప్పుపట్టడం చేతగాని కాంగ్రెస్ దద్దమ్మలు నాపై మాట్లాడుతారా? దమ్ముంటే రేవంత్‌ను నిలదీయాలి. బుద్ధి చెప్పకుండా ఎందుకు కాపాడుతున్నారు.
– కేటీఆర్
హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ) : గాంధీ కుటుంబాన్ని, రాహుల్‌గాంధీని, సోనియాగాంధీని అడ్డగోలుగా తిట్టిన రేవంత్‌రెడ్డిని పకన పెట్టుకొని హామీలపై నిలదీసిన తనలాంటి ప్రతిపక్ష నేతలపై మాట్లాడటం కాదని.. దమ్ముంటే రేవంత్‌రెడ్డిపై నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. అలాంటి వ్యక్తిని పకన పెట్టుకొని తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం చెప్పడంపై సానుభూతి వ్యక్తం చేశారు. సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని దుర్భాషలాడిన రేవంత్‌రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్న విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు మరచిపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్‌రెడ్డి అనేకసార్లు చేశారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డిని తప్పుపట్టడం చేతగాని హస్తం నేతలు.. ఇప్పుడు తన మాటతీరుపైన మాట్లాడటం చూస్తుంటే జాలేస్తున్నదని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం ఉదయం కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి సర్పంచ్ రంజిత్ దివ్యశ్రీ, ఆయన అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుల సభ్యులను కేటీఆర్ అభినందించారు. సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్, బీజేపీ నాయకులు రవియాదవ్ నాయకత్వంలో నరేందర్‌యాదవ్, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పిన కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్‌రెడ్డిని, రాహుల్‌గాంధీని తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
రేవంత్ ముఖ్యమంత్రా.. బోటీ కొట్టేటోడా?
అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని గట్టిగా అడిగితే లాగులో తొండలు ఇడుస్త.. పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా.. అని బూతులు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అసలు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా? లేక బోటీ కొట్టేటోడా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలే ఉన్నాయని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు ఎగవేశారని, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని, హైడ్రా వంటి అరాచక చర్యలతో ఇండ్లు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. చెక్‌డ్యామ్‌లు కట్టాల్సిన చోట అవే చెక్‌డ్యామ్‌లను పేల్చడం ప్రపంచ చరిత్రలో ఎకడా కనిపించదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, గుడిసెలు కూల్చుడు తప్ప? ఒక్క ఇల్లు కట్టిందా? కొత్త బ్రిడ్జి కట్టారా? కల్వర్టు నిర్మించారా? రోడ్డు వేశారా? ఒక్క మంచి పని అయినా చేశారా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి నదులపై, జల వనరులపై కనీస అవగాహన లేని అజ్ఞాని అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే భయంతోనే 90శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి పూర్తిచేయడం లేదని విమర్శించారు. తన పాత బాస్‌కు కోపం వస్తుందని భయపడుతూ పాలమూరును ఎండబెడుతున్నాడని మండిపడ్డారు. గడచిన దశాబ్దంలో యూరియా కొరత, విత్తనాల పోటీ, కరెంటు కష్టాలు ఏవీ లేవని, క్రాప్ హాలిడే అన్న మాటే లేకుండా కేసీఆర్ రైతులను కంటికిరెప్పలా కాపాడారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలన వల్లే నేడు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్న దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్‌కు ‘గాంధీ’ అమ్ముడుపోయారు..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కేవలం భూములను కాపాడుకునేందుకే రేవంత్‌రెడ్డి పంచన చేరి డబ్బులకు అమ్ముడుపోయాడన్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి వెయ్యి కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు ఎన్నికల్లో ప్రచారం చేసుకొని గెలిచి ఇప్పుడు వెయ్యి కోట్ల విలువైన భూమి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్కు ద్రోహం చేసి వెళ్లినా ఎకడ సమావేశం పెట్టినా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి విజయవంతం చేస్తున్నారని తెలిపారు. హైడ్రా పేరుతో నియోజకవర్గంలో పేదల ఇండ్లు కూల్చుతున్న తీరును ప్రతి ఒకరికీ తెలియజేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రియల్ ఎస్టేట్‌ను పండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నరు అని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయగౌడ్, రంగినేని అభిలాశ్, కుర్వ విజయ్, ఇంతియాజ్, ఆల్యానాయక్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, నాయకులు సాయిబాబా, నవతారెడ్డి, కార్తిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల్లో ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలను పెడుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికలను పార్టీ శ్రేణులంతా కలిసి సమష్టిగా ఎదురొని విజయం సాధించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరవేద్దాం. బీఆర్ఎస్ హయాంలో రూ.9,700 కోట్లతో హైదరాబాద్ నగరానికి అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రజలకు వివరించాలి. నగరాన్ని అభివృద్ధి చేసిన తీరు ప్రతి డివిజన్లోని ఓటర్లకు, ప్రజలకు ప్రచారం చేయాలని కోరారు.
– కేటీఆర్
తెలంగాణ వైద్యరంగంలో నవశకం టిమ్స్: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో తలపెట్టిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) రాష్ట్ర వైద్యరంగంలో నూతన శకానికి నాంది పలుకబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తెలిపారు. హైదరాబాద్ నగర ఆరోగ్య మౌలిక సదుపాయాలకు సరికొత్త హంగులు జత కలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ నెట్వర్ను బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా సనత్‌నగర్‌లోని టిమ్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి, హైదరాబాద్ నలుమూలలా (సనత్‌నగర్, గడ్డి అన్నారం, అల్వాల్, గచ్చిబౌలి) కార్పొరేట్ స్థాయి చికిత్సను అందించేలా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖాన సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచడంతో పాటు ఉత్తర తెలంగాణ అవసరాలు తీర్చేలా వరంగల్‌లో రాష్ట్రంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు కూడా కేసీఆర్ పాలనలో చర్యలు తీసుకున్నారని గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
కొల్లాపూర్‌లో గెలువనని జూపల్లికి తెలిసిపోయింది
కొల్లాపూర్ ప్రజలు జూపల్లి కృష్ణారావును మళ్లీ ఎట్టిపరిస్థితుల్లో గెలిపించబోరని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డిని సంతృప్తిపరచడానికి ఆయనను ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగడటం నిస్సహాయత, స్వార్థపూరిత అవకాశవాదం తప్ప మరేమీ కాదని ఆయన విమర్శించారు.
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బలంగా గెలిచి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా బీఆర్ఎస్ శ్రేణులు ఏకమై పనిచేయాలని సూచించారు. కష్టసమయంలో కొల్లాపూర్ ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటామని, మల్లేశ్‌యాదవ్, శ్రీధర్‌రెడ్డి మరణాల సమయంలో రెండు సార్లు వచ్చి ప్రజల బాధలో పాలుపంచుకున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. కొల్లాపూర్‌లో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒకరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సంక్రాంతి తర్వాత తిరిగి కొల్లాపూర్‌లో పర్యటిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తుందో రాదో నాకు తెల్వదు. నేను గెలుస్తనో లేదో కూడా నాకు తెల్వదు అని నిరుడు ఆదిలాబాద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణారావును మళ్లీ కొల్లాపూర్ ప్రజలు గెలిపించబోరు. జూపల్లి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్‌ను దేవుడిగా, పాలమూరు పుణ్యపురుషుడిగా కీర్తించిన జూపల్లి.. నేడు కుర్చీ కోసం అబద్ధాలు చెప్తూ తిరుగుతున్నారు.
– కేటీఆర్