‘రామునితో కపివరుండిట్లనియే’.. రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు అక్షరాల స్థానం మారితే ఎంతటి ప్రమాదమో చెప్పడానికి చిన్నప్పుడు స్కూళ్లో ఉపాధ్యాయులు ఈ ఉదాహరణ చెప్తుండేవారు. విద్యార్థులు తెలియక ‘రామునితో కపివరుండిట్లనియే’కి బదులుగా ‘రాముని తోక పివరుండట్లనియే’ అని చెప్తే ఎంతటి అనర్థం వస్తుందో ఉపాధ్యాయుడు కాస్త హాస్యాన్ని జోడించి వివరించేవాడు. మన గౌరవ సీఎం రేవంత్ అక్షరాలను కాదు, ఏకంగా పారాగ్రాఫ్‌ల స్థానాలనే మార్చేశారు. ఒక పేరాలో ఉన్నదాన్ని మరో పేరాలో ఉన్నదానితో కలిపి చదివారు.
ఒకరు చెప్పిన దానితో వాక్యాన్ని మొదలుపెట్టి, ఇంకొకరు చెప్పినదానితో ముగించారు. అది కూడా అసెంబ్లీ వేదికగా. పాలమూరుకు కేసీఆర్, బీఆర్ఎస్ అన్యాయం చేశారంటూ ‘ఇవిగో రుజువులు’ అంటూ… పేపర్ల కట్టలను చేతిలో పట్టుకొని, అందులో ఉన్నది ఉన్నట్టు చదువకుండా తనకు అవసరమైన చోట, తనకు కావాల్సిన అర్థం వచ్చేవిధంగా అక్కడో ముక్క.. అక్కడో ముక్క ఏరుకొని చదివేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు అబద్ధాలకోరులని చెప్తూ.. శాసనసభను, నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజలను తన మాటల కుట్రలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలని చూశారు. పేపర్లలోనే ఉన్నది అని చెప్తే ఎవరైనా గుడ్డిగా నమ్మేస్తారనుకున్నాడో, లేకపోతే ఎవరూ ఆ పేపర్లను చెక్ చేయరనుకున్నాడో ఏమో గానీ, తాను ‘సత్య ప్రమాణంగా ఇవన్నీ చెప్తున్నాను’ అంటూ తనకు అలవాటైన పద్ధతిలోనే దేవుడి మీద కూడా ప్రమాణం చేశాడు రేవంత్‌రెడ్డి.
తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా నీళ్లు చాలని కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్లో సంతకం చేసి రాష్ర్టానికి మరణశాసనం రాశారని, పాలమూరు ప్రాజెక్టును కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చి చట్టబద్ధత కల్పించిందని, కమీషన్ల కోసమే ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ జూరాల నుంచి శ్రీశైలానికి మార్చాడని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కేవలం తను చెప్పడం వల్లనే, తన మీద ఉన్న గౌరవంతోనే చంద్రబాబు ఆపేశాడని ఇలా.. అసెంబ్లీలో రేవంత్ చెప్పిన అబద్ధాలకు అంతే లేదు. రేవంత్ కుట్రలను తిప్పికొడుతూ, అబద్ధాలను బట్టబయలు చేస్తూ హరీశ్‌రావు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్ చెప్పిన అబద్ధాలను హరీశ్‌రావు ఆధారాలతో సహా నిరూపించాడు. రేవంత్ లాగా పారాగ్రాఫ్‌లను స్కిప్ చేయడానికి ప్రయత్నించలేదు. రేవంత్ అబద్ధాలను ఉతికారేసి ఎండగట్టాడు. ఆ అన్ని విషయాల జోలికి నేను పోదల్చుకోలేదు. కానీ, శిష్యుడు రేవంత్ తన గొప్ప కోసం చేసిన తింగరి పని గురువు చంద్రబాబును ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రస్తావించుకోవాలి. తన శిష్యుడు తెలంగాణ అసెంబ్లీలో చెప్పింది అబద్ధమని గురువే ధ్రువీకరించిన విషయాన్ని గమనించాలి.
‘రాయలసీయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కేవలం నేను చెప్పానని చంద్రబాబు ఆపేశారు. రెండు రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను ఆ విషయం బయటకు చెప్పుకోలేదు’ అని శిష్యుడు రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఆయన గురువు చంద్రబాబును బాగా ఇరకాటంలో పడేసింది. రేవంత్ తెలంగాణకు నీళ్లు తీసుకురాలేకపోయారు గానీ, రాజకీయ గురువు చంద్రబాబు కుర్చీ కిందికే నీళ్లు తెచ్చే పరిస్థితి తీసుకువచ్చారు. అందుకే, ఆగమేఘాల మీద రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని అందులో స్పష్టం చేసింది. ఆ తర్వాత జగన్ మూడేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే విధించిందని కూడా తెలిపింది. తద్వారా.. శిష్యుడు రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో చెప్పిందంతా అబద్ధమని గురువు చంద్రబాబు కూడా తేల్చేశారు. చంద్రబాబు మాటలను ఎవడు నమ్ముతాడని అంటారా? పోనీ అలా అనుకున్నా.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎన్జీటీ 2021 జూన్ 18నే స్టే విధించింది. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఫిర్యాదుతో అంతకుముందే పనులు ఆగిపోయాయి. అప్పుడు రేవంత్ అధికారంలో లేడు. అక్కడ చంద్రబాబూ అధికారంలో లేడు. మరి తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ చెప్పిండని, ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులను ఎలా ఆపేశాడు? ఏపీ ప్రభుత్వ ప్రకటన చూసి ఇప్పుడు సీఎం రేవంత్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? అసెంబ్లీ వేదికగా సీఎం ఇలా అబద్ధాలు ఆడవచ్చునా?
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా జలాల కేటాయింపులున్నాయని, ఇది అన్యాయమని, తెలంగాణ ఏపీ మధ్య నీళ్ల పునఃపంపిణీ జరగాలని కేసీఆర్ మొదటినుంచీ పోరాడుతూనే ఉన్నారు. దీనికోసం ట్రైబ్యునల్ వేయాలని పోరాడి విజయం సాధించారు. ట్రైబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయి. ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు ఈ 299టీఎంసీల సంపూర్ణ వినియోగం కోసం ప్రాజెక్టులను కట్టుకుంటామని, ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు. దీన్ని రేవంత్ మరణశాసనం అని చెప్పుకొచ్చారు. నిజానికి తెలంగాణకు మరణశాసనం రాసింది రేవంత్ రెడ్డి. 90 టీఎంసీల పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 45టీఎంసీలకు కుదించడమే రేవంత్ తెలంగాణకు రాసిన మరణశాసనం.
పాలమూరు డీపీఆర్ వెనక్కి వస్తే బయటకు చెప్పకుండా దాయడం మరణశాసనం. చివరికి కేసీఆర్ ఆ విషయాన్ని బయటపెట్టేవరకు రేవంత్ కానీ, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కానీ ఎక్కడా ఆ విషయాన్ని వెల్లడించలేదు. కేసీఆర్ గర్జనతో చివరికి వారే అసెంబ్లీ వేదికగా పాలమూరు ఎత్తిపోతలపథకాన్ని 45 టీఎంసీలకు కుదించినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది.
చివరగా ఒక్క అంశం.. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇంగ్లీష్ గురించి మాట్లాడారు. తనకు ఇంగ్లిష్ రాదంటున్నారని, పరిపాలకుడికి ఇంగ్లిష్ రావాల్సిన అవసరం లేదని, పాలన వస్తే సరిపోద్దని ఇంకా ఏదేదో అన్నాడు. నిజమే ఇంగ్లిష్ మేధస్సుకు కొలమానం కాదు. రేవంత్‌ను కూడా ఎవరూ ఇంగ్లిష్ రాదని విమర్శించలేదు. కేటీఆర్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఇంగ్లిష్ బాగా మాట్లాడతాడని ప్రజలు అనుకుంటుంటే.. రేవం త్ ఆత్మన్యూనతా భావంతో ఆ మాటలన్నారు. కానీ, అసెంబ్లీలో కాగితాలు చేతబట్టి ఒక పేరాకు మరో పేరాకు లింక్ చేసి చదువుతుంటే.. రేవంత్‌కు చదవడం వచ్చుంటే ఏ పేరాకు ఆ పేరానే చదవాలని, ఎక్కడికక్కడ స్కిప్ చేయకూడదని తెలిసి ఉండేదని అనిపించింది. రేవంత్ అనుకున్నట్లు తనది భాష సమస్య కాదు. ఆయనకు పాలనే చేతకాదు. పైగా ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ వేదికగా ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పి ఉండడు.
హరీశ్‌రావు పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రేవంత్‌కు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
దాసోజు శ్రవణ్‌కుమార్