హిమాయత్‌నగర్, జూలై 30 : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆటోడ్రైవర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం పిలుపునిచ్చారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటోడ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోమీటర్ చార్జీలు పెంచాలని, ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి యాదగిరి, యూనియన్ నాయకులు కొమురవెల్లి బాబు, భిక్షపతియాదవ్, ఒమర్‌ఖాన్, జంగయ్య పాల్గొన్నారు.