చిన్నగూడూరు, జూలై 21 : నిజాం ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందార్ల అరాచకాలపై తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్ని ధారలుగా మలిచి.. రుద్రవీణలు మోగించి.. ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. ఎన్నో గేయాలు, పద్యాలు, నవలలు రచించి సాహితీ రంగంలో చెరగని ముద్రవేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రానికి చెందిన వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడు కృష్ణమాచార్యులు 22 జూలై 1925లో జన్మించారు. బుధవారం ఆయన స్వస్థలంలో జరుగనున్న జయంతి వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వివిధ సంఘాల బాధ్యులు హాజరుకానున్నారు. ఆ మహనీయుడిని స్మరించుకునేందుకు గ్రామస్తులు ఉత్సాహంగా ఉన్నారు.
నిజాం నిరంకుశ పాలన, జాగీర్ధార్ వ్యవస్థపై దాశరథి గళమెత్తి తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపాడు.‘ఓ నిజాం నిరంకుశ పిశాచమా.. కానరాడు నినుబోలిన రాజు మాకెన్నడేని.. తీగలను తెంపి అగ్నిలో దింపినావు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’.. ఎముకలను మసిచేసి పొలాలు దున్ని.. భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే.. తెలంగాణము రైతుదే..’ అంటూ తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ధీరుడు దాశరథి. సాయుధ రైతాంగ పోరాటంలో తన రచనలతో ప్రజలను జాగృతం చేసి నిజాం ప్రభువులను గడగడలాడించిన ఘనుడు దాశరథి. నిజాం ప్రభువును ఎదురించి జైలు జీవితం అనుభవించి స్ఫూర్తిగా నిలిచాడు. సినీ గేయ రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ సాహితీ యోధుడి సేవలను గుర్తించి గత ప్రభుత్వం యేటా ఆ మహనీయుని పేరున అవార్డులను ప్రదానం చేసింది.
రుద్రవీణ, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం, అగ్నిధార, కవితా పుస్తకంలాంటి ఎన్నో అద్భుత రచనలు చేసి సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1976లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్, 1977లో ఏపీ ఆస్థాన కవిగా, 1975లో ఆంధ్రా విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. ఇలా ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నారు.