గజ్వేల్, నవంబర్ 6: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసిన రైతులకు కాలం కలిసివస్తున్నది. రాష్ట్రంలో వాణిజ్య పంటలు పండించిన రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. దూదిపూల సాగు చిరునవ్వులు పూయిస్తున్నది. ఈ ఏడాది పత్తి సాగు చేసిన రైతుల ఇంటికి ధనలక్ష్మి తరలివస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు మించి, ఖరీదు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పత్తి రకాలను బట్టి క్వింటాల్‌కు రూ.5,726 నుంచి రూ.6,025 వరకు ఉండగా అంతకు మించిన రేటు లభిస్తుండటం విశేషం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో శనివారం క్వింటాల్ పత్తికి రూ.8,487 గరిష్ఠ ధర పలకడమే ఇందుకు నిదర్శనం. రెండ్రోజుల దీపావళి సెలవుల అనంతరం మార్కెట్లో పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. శనివారం 35 మంది రైతులు 123 క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చినట్టు గజ్వేల్ ఏఎంసీ కార్యదర్శి జాన్‌వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ తెలిపారు. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా కమీషన్ వ్యాపారులు క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.8,487 చెల్లించినట్టు వివరించారు. పత్తికి ఈ స్థాయి ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.