Thyroid Diet | థైరాయిడ్ అనేది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకప్పుడు ఈ వ్యాధి అంటేనే ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు చిన్నారులు సైతం థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, వంశ పారంపర్యత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. హైపో, హైపర్ థైరాయిడిజం అని రెండు రకాల థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. వీటిల్లో ఏది ఉన్నా సరే డాక్టర్ సూచించిన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను మాత్రమే తినాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.
థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. అలా అని చెప్పి అయోడైజ్డ్ సాల్ట్‌ను అధికంగా తినకూడదు. ఉప్పును మోతాదులోనే తినాలి. కానీ అయోడిన్ అధికంగా ఉండే ఇతర ఆహారాలను తినాల్సి ఉంటుంది. అలాగే కోడిగుడ్లు, పెరుగు, చేపలు వంటి ఆహారాలను తింటే మేలు జరుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు సెలీనియం ఉన్న ఆహారాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. బ్రెజిల్ నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. రోజుకు 2 బ్రెజిల్ నట్స్‌ను తింటున్నా ఉపయోగం ఉంటుంది. కోడిగుడ్లు, పొద్దు తిరుగుడు విత్తనాల్లోనూ సెలీనియం అధికంగా ఉంటుంది. కనుక ఈ ఆహారాలను కూడా తినవచ్చు. అలాగే జింక్ ఎక్కువగా ఉండే మటన్, చికెన్, గుమ్మడికాయ విత్తనాలు, శనగలు, జీడిపప్పు, పెరుగును తింటే మేలు జరుగుతుంది.
థైరాయిడ్ ఉన్నవారు బ్రోకలీ, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలకు దూరంగా ఉండాలి. లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఫైబర్ అధికంగా ఉండే తృణ ధాన్యాలు, పండ్లు, ఇతర కూరగాయలు, పప్పు దినుసులను తినవచ్చు. ఆలివ్ ఆయిల్, అవకాడోలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్ నట్స్‌ను తింటున్నా ఉపయోగం ఉంటుంది. సోయా ఉత్పత్తులైన టోఫు, సోయా పాలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఉన్నవారు సోయా ఉత్పత్తులను అసలు తీసుకోకూడదు. లేదంటే అవి థైరాయిడ్ మందుల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాగే ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెరలు, మద్యం వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ లేని ఉప్పును తినకూడదు. కేవలం అయోడిన్ ఉన్న ఉప్పునే తినాల్సి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉంటే కోడిగుడ్డు లోపలి సొన తీసేసి కేవలం తెల్ల సొనను తినవచ్చు. అలాగే పాలు, చీజ్, పెరుగులోనూ అయోడిన్ ఉంటుంది. వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. కానీ కొవ్వు తీసిన పాలు అయితే మంచిది. అలాగే నారింజ పండ్లను తింటుండాలి. థైరాయిడ్ ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి. ఐరన్ అధికంగా ఉండే పాలకూరను, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కలిగిన పసుపును కూడా తీసుకోవాలి. తృణ ధాన్యాలను రోజూ తింటుంటే మేలు జరుగుతుంది. టీ, కాఫీ, సోడా, చాకొలెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీలను సేవించవచ్చు. థైరాయిడ్ ఉన్నవారికి కొందరికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. అలాంటి వారు గోధుమ పిండి తినకూడదు. చిరు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇలా థైరాయిడ్ ఉన్నవారు ఆయా ఆహారాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.