Vitamin K | మనం ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రమే కాదు, వ్యాధుల నుంచి మనల్ని రక్షించేందుకు కూడా మనకు పోషకాలు అవసరం అవుతాయి. ఇవి మన శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తాయి. అయితే ఒక పోషక పదార్థం కేవలం ఒక పనే పనిచేయదు. అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. కానీ చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫలానా పనికోసం కేవలం ఫలానా పోషక పదార్థం మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఉదాహరణకు క్యాల్షియం అంటే కేవలం ఎముకలకు మాత్రమే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి క్యాల్షియం ఇంకా అనేక జీవక్రియలకు పనిచేస్తుంది. అలాగే విటమిన్ కె కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని కేవలం గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టి రక్తస్రావం అవకుండా ఉండేందుకు మాత్రమే పనిచేస్తుందని భావిస్తారు. కానీ విటమిన్ కె మనకు ఎన్నో రకాలుగా పనిచేస్తుంది.
మన శరీరంలో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే చాలా మంది క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఉండే ఆహారాలను తింటారు. కానీ ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కె కూడా పనిచేస్తుంది. విటమిన్ కె వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కండరాల పనితీరు మెరుగు పడుతుంది. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్ కె మనకు కొబ్బరినూనె, ఆవనూనె, ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్లో అధికంగా లభిస్తుంది. కనుక వీటిని తీసుకుంటే విటమిన్ కె ను పొందవచ్చు. అలాగే విటమిన్ కె వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు నిర్మాణం అయ్యేందుకు కూడా విటమిన్ కె పనిచేస్తుంది. దీని వల్ల ఎముకలు గుల్లగా మారకుండా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఇక విటమిన్ కె కేవలం ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా పనిచేస్తుంది. విటమిన్ కె గుండెను రక్షిస్తుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ కె ఉండే ఆహారాలను తీసుకుంటుంటే హైబీపీని తగ్గించుకోవచ్చు. బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. విటమిన్ కె యాంటీ క్యాన్సర్ గుణాలను సైతం కలిగి ఉంటుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. అందువల్ల విటమిన్ కె ఉండే ఆహారాలను తింటుంటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. విటమిన్ కె వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి విటమిన్ కె ఎంతో మేలు చేస్తుంది.
ఇక విటమిన్ కె మనకు అనేక ఆహారాల్లో లభిస్తుంది. క్యాబేజీ, ఆవాలు, పాలకూర, అవకాడో, కివీ, బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు, ద్రాక్ష, దానిమ్మ పండ్లు, చికెన్, కోడిగుడ్లు, జీడిపప్పు, వాల్నట్స్, చేపలు వంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆహారాలను తింటుంటే విటమిన్ కె మనకు సమృద్ధిగా లభిస్తుంది. ఇక విటమిన్ కె పురుషులకు రోజుకు 120 మైక్రో గ్రాముల మోతాదులో అవసరం అవుతుంది. స్త్రీలకు 90 మైక్రోగ్రాముల విటమిన్ కె కావాలి. చిన్నారులకు రోజుకు 55 మైక్రోగ్రాములు, టీనేజ్‌లో ఉన్నవారికి రోజుకు 60 మైక్రోగ్రాముల విటమిన్ కె అవసరం అవుతుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటే విటమిన్ కె ని అధికంగా పొందవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.