న్యూఢిల్లీ: కమల్‌హాసన్ నటించిన థగ్ లైఫ్(Thug Life) సినిమాను కర్నాటకలో రిలీజ్ చేయాల్సిందే అని, అది ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్‌ను రిలీజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని కోర్టు చెప్పింది. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని బెదిరిస్తున్న వారిని నియంత్రించాలని, దీనిపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
తమిళం నుంచే కన్నడ భాష పుట్టినట్లు ఫిల్మ్ స్టార్ కమల్‌హాసన్ ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. దీంతో అతను నటించిన థగ్‌లైఫ్ సినిమాను కర్నాటకలో రిలీజ్ చేయకుండా అడ్డుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కమల్‌హాసన్ కోర్టును ఆశ్రయించారు. సుప్రీం చివాట్లతో దిగివచ్చిన కర్నాటక ప్రభుత్వం నిరసనకారులపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటున్నవారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సుప్రీం తీర్పుతో సంతృప్తి చెందానని, కేసును మూసివేస్తున్నట్లు కమల్ తెలిపారు.
కేసు వాదనల సమయంలో కర్నాటక సర్కారు ఇచ్చిన హామీలను ధర్మాసనం ఆలకించింది. ఒకవేళ ఎవరైనా సినిమాను అడ్డుకుంటే వారిపై కర్నాటక సర్కారు తీవ్ర చర్యలు తీసుకుంటుందని సుప్రీం తెలిపింది. ఒకవేళ థగ్‌లైఫ్ సినిమా రిలీజైతే .. థియేటర్లకు రక్షణ కల్పించనున్నట్లు కర్నాటక ప్రభుత్వం కోర్టు చెప్పింది.
జూన్ 5వ తేదీన థగ్‌లైఫ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివాదం వల్ల కర్నాటకలో ఆ ఫిల్మ్‌ను బ్యాన్ చేశారు.