విశ్వంలో మన సౌరకుటుంబమే ప్రత్యేకం అని చాలామంది అనుకుంటారు. కానీ అంతరిక్షలోకి తొంగి చూసేకొద్దీ చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్‌కు చెందిన కొందరు ఆస్ట్రోనామర్లకు రోదసిలో అరుదైన దశ్యం కనిపించింది. మన సౌరకుటుంబానికి 150 కాంతి సంవత్సరాల దూరంలో ఒక సౌరకుటుంబ వ్యవస్థ వారి కంట పడింది. దీనిలో మూడు నక్షత్రాలు కనిపించాయి.
రెండు చిన్న సైజు నక్షత్రాలు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతుండగా.. ఈ రెంటికన్నా పెద్ద నక్షత్రం ఒకటి ఈ రెండింటి చుట్టూ తిరుగుతూ కనిపించింది. అమెచ్యూర్ ఆస్ట్రోనామర్లు దీన్ని చూసి తాము ఏదో పొరబడ్డామేమో అనుకున్నారు. కానీ ప్రొఫెషనల్స్ దీన్ని పరిశీలించి అది కూడా ఒక సౌర వ్యవస్థేనని తేల్చారు. టీడబ్ల్యూ హైడ్రా కాన్స్టలేషన్లో ఉన్న దీనికి హెచ్డీ 98800 అని పేరు పెట్టారు.
దీనిలో రెండు చిన్న నక్షత్రాలు మన లెక్కల ప్రకారం 24 గంటల్లో ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమణం పూర్తిచేస్తాయి. ఈ రెండూ కలిపి మన సూర్యుడి కన్నా 12 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉన్నాయని సైంటిస్టుల అంచనా. ఇక వీటిలో అన్నింటికన్నా పెద్దదైన మూడో నక్షత్రం సూర్యడి కన్నా 16 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంది.
అంతేకాదు, ఇది మిగతా రెండు నక్షత్రాల చుట్టూ ఏడాది కాలంలో ఆరుసార్లు పరిభ్రమణం చేస్తుంది. వీటి ఆధారంగా ఒక మోడల్ తయారు చేశామని, కానీ మరింత సమాచారం కోసం మోడల్స్‌పై ఆధారపడలేమని కోపెన్హాగన్ వర్సిటీకి చెందిన అలెజాండ్రో విగ్నా గోమెజ్ తెలిపారు.