పెద్దఅంబర్‌పేట, మే 21 : బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామం కన్నీరుమున్నీరైంది. కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొని గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతున్నాడు. మరో రెండు నిమిషాల్లో ఇండ్లకు చేరుకుంటారనగా.. జరిగిన ప్రమాదం ఊరిలో విషాదం నింపింది. గ్రామంలోని బంధువులకు సంబంధించిన రిసెప్షన్ పెద్దఅంబర్‌పేటలోని ఓ కన్వెన్షన్‌లో నిర్వహించగా.. పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్‌రెడ్డి (24), చుంచు వర్షిత్‌రెడ్డి (23), ఎలిమినేటి పవన్‌కల్యాణ్‌రెడ్డి (సన్నీ) అంతా కలిసి పాల్గొన్నారు.
రిసెప్షన్ అనంతరం మళ్లీ ఇండ్లకు చేరుకున్నట్టు తెలుస్తున్నది. తర్వాత త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డికి చెందిన బైక్‌లను గ్రామంలోని పాతపంచాయతీ కార్యాలయం వద్ద పెట్టారు. సన్నీ, చంద్రసేనారెడ్డి కారులో రాగా.. నలుగురు కలిసి పసుమాములలోని సర్వీస్ రోడ్డులో ఉన్న ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్టు సమాచారం. బుధవారం తెల్లవారుజామున కుంట్లూరు గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయానికి వస్తున్నారు. మరో రెండు నిమిషాల్లో అక్కడకు చేరుకుంటారనగా కుంట్లూరు-పసుమాముల రోడ్డులోని నారాయణ కాలేజీ (బాసర క్యాంపస్) సమీపంలో మలుపు వద్ద అతివేగంగా కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి.
చంద్రసేనారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. సన్నీకి తీవ్ర గాయాలు కాగా.. ప్రైవేట్ దవాఖానకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. చంద్రసేనారెడ్డి కారు నడుపుతుండగా.. సన్నీ పక్కన కూర్చున్నాడు. త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డి వెనక సీట్లో ఉన్నారు. సన్నీ సీటు బెల్టు ధరించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తున్నది. మృతుల కుటుంబాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ తదితరులు పరామర్శించారు.
కుంట్లూరుకు చెందిన పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి ఒక్కగానొక్క కుమారుడు చంద్రసేనారెడ్డి. చుంచు జంగారెడ్డికి సైతం త్రినాథ్‌రెడ్డి ఒక్కడే కొడుకు. చుంచు శ్రీనివాస్‌రెడ్డికి కూడా వర్షిత్‌రెడ్డి ఒక్కడే కుమారుడు. ఒక్క రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాలకు వారసులను లేకుండా చేసింది. చుంచు జంగారెడ్డి, చుంచు శ్రీనివాస్‌రెడ్డి సొంత అన్నదమ్ములు. వీరిద్దరి కుమారులు ఒకే ప్రమాదంలో మృతిచెందడంతో విషాదం నింపింది. అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలు, చేతికందే వయసులో అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాదం అలుముకున్నది. కుమారులు కండ్ల ముందే విగతజీవులుగా కనిపిస్తుండటంతో ఆయా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చదువు పూర్తయిన పిల్లలు.. ఇక కంటికి రెప్పలా చూసుకుంటారనే పడుతున్న ఆశలన్నీ ఒక్క ప్రమాదంతో ఆవిరైపోయాయి.
కుంట్లూరు-పసుమాముల రోడ్డులో నారాయణ కాలేజీ (బాసర క్యాంపస్) వద్ద మూల మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. మూడు నెలల వ్యవధిలో ఐదారుకుపైగా ప్రమాదాలు ఇక్కడే జరిగాయి. అయినప్పటికీ ఒక్క సూచిక బోర్డు కూడా లేదు. గత వారం ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఇంకా ఆ కారును అక్కడి నుంచి తొలగించకముందే మరో ప్రమాదం ముగ్గురిని బలిగొన్నది. కల్వర్టు వద్ద రోడ్డు చిన్నదిగా మారడం, మలుపు దగ్గరకు వచ్చేవరకు వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడుతున్నారు. పలుమార్లు ప్రమాదాలు జరిగినా పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా రోడ్డును విస్తరించి, మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కుంట్లూరు రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ నవీన్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులు వారికి వివరించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాదానికి గురయిన వాహనాలను అక్కడ నుంచి తరలించారు.