కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 25 : భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో మంగళవారం చోటు చేసుకుంది. దంతేవాడ జిల్లా సరిహద్దు గీదమ్ పోలీస్స్టేషన్ పరిధిలో గ్రామాల్లో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. అనంతరం తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతులలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు(డీకేఎస్జడ్ఎం) సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళితోపాటు ఎస్జడ్ఎంలు మన్ను బార్సా, పండరూ అతర్ ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. సుధాకర్ తెలంగాణ రాష్ట్రం వరంగల్ ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఇతడిపై ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.