ముంబై: పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలుకు (Puducherry Express) పెను ప్రమాదం తప్పింది. దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి ముంబైలోని మాతుంగా-దాదర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. దీంతో రైలులోని మూడు బోగీలు రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు జరిగాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
పట్టాలు తప్పిన బోగీలను సరిచేయడానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన ఏడు రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించారు.
నెల రోజుల వ్యవధిలో సెంట్రల్ రైల్వేలో జరిగిన రెండో ప్రమాదం కావడం విశేషం. ఏప్రిల్ 3న నాశిక్ వద్ద పవన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. కాగా, భారతీయ రైల్వే నేటితో 169 వసంతాలు పూర్తిచేసుకుంటున్నది. దానికి ముందు రోజే ఈ ప్రమాదం జరగడం విశేషం. దేశంలో మొదటి ప్యాసింజర్ రైలు 1853, ఏప్రిల్ 16న ముంబై-థాణే మధ్య నడిచింది.