కురవి, ఆగస్టు 29: నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసి వివిధ బ్యాంకుల్లో రూ.16,90,000 విలువగల రుణాలు ఇప్పించిన గుట్టును కురవి పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు వివరాలను వెల్లడించారు. కురవి మండలం నేరడ శివారు ఎల్కచెట్టు తండా జీపీ పరిధిలోని మంచ్యా తండాకు చెందిన మూడ్ బాలాజీ, మహబూబాబాద్ మండలం అమన్ గల్ శివారు కస్నా తండాకు చెందిన బానోత్ హరికిషన్, జాఫర్గడ్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన బానోత్ వర్జన్ ముగ్గురు కలిసి వివిధ మండలాల్లోని కొంతమంది రైతులకు మభ్య పెట్టి మీకు ఎక్కువ లోన్ ఇప్పిస్తాం అని, దానికి ఖర్చు అవుతుందని చెప్పి వారు ఒక్కో పాస్ బుక్ కి రూ.10వేలు వసూళ్లు చేశారు.
నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి వివిధ బ్యాంకుల్లో ముగ్గురికి లోన్ రూ.16,90,000 విలువ గల లోన్స్ ఇప్పించారు. అలాగే మరల కొంతమంది వ్యక్తులవి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి వీటికి నకిలీ 1బీ, ఈసీ లు తయారు చేయడానికి కురవికి వచ్చిన సమయంలో వీరిని పట్టుకున్నామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న కొంతమంది పరారీ లో వున్నారని వివరించారు. సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య, సీసీఎస్ సీఐ హత్తిరామ్, కురవి ఎస్ గండ్రాతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.