సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : మహిళలకు అశ్లీల వీడియోలు పంపడమే కాకుండా సీఐడీ అధికారినంటూ బెదిరించిన ఓ ప్రైవేటు ఉద్యోగిని మంగళవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అస్మత్పూర్ గ్రామానికి చెందిన కల్ల వినోద్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. అతడు తన స్మార్ట్ ఫోన్లో నిత్యం అశ్లీల వీడియోలు, ఫొటోలు చూస్తూ.. వాటికి బానిసయ్యాడు. దీంతో మహిళలతో నగ్న వీడియోలు మాట్లాడాలనే ఆలోచనతో తనకు తోచిన నంబర్‌కు వాట్సాప్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్‌ను ఎవరైనా మహిళ, యువతి ఎత్తితే ఆ నంబర్‌కు అశ్లీల వీడియోలు, ఫొటోలు పంపిస్తాడు. ఆ వీడియోలను చూసినట్లు బ్లూ రంగు టిక్‌లు కనపడగానే వారికి వాట్సాప్ కాల్ చేసి వేధిస్తుంటాడు. నగ్నంగా మాట్లాడాలని బెదిరిస్తుంటాడు. తాను ఓ సీఐడీ ఆఫీసర్ అని తనను ఎవరూ ఏమి చేయలేరని హెచ్చరిస్తుంటాడు. ఈ విధంగా వేధింపులకు గురైన ఓ మహిళ రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు మంగళవారం వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.