వరంగల్, జూన్ 3 : వానకాలం వస్తున్నదంటే నగర వాసులు వణికిపోతున్నారు. వరంగల్ లోతట్టు ప్రాంతా ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటా నగ రం వరదల బారిన పడుతున్నా బల్దియా అధికారులు మాత్రం శాశ్వత ముంపు నివారణ పనులు చేపట్టడంలో విఫలమవుతున్నారు. వరుసగా రెండేళ్లు నగరం ముంపునకు గురవుతున్నా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరానికి శాశ్వత ముంపు నివారణ కోసం రూ. 250 కోట్లతో చేపట్టిన పనులను పూర్తిచేయక పోవడంతో ఈసారి కూడా మునుగుడేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని బొందివాగు విస్తరణ, భద్రకాళీ చెరువులోకి వరద నీరు మళ్లింపు గేట్ల నిర్మాణం ఇంకా చేపట్టనే లేదు.
రెవెన్యూ, ఇరిగేషన్, బల్దియా అధికారులు సంయుక్తంగా నాలాల వాస్తవ హద్దులను నిర్ణయించి విస్తరణ చేపట్టాల్సి ఉంది. అయితే మూడు శాఖల మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడం లేదు. శాశ్వత ముంపు నివారణకు పరిష్కారం కొలిక్కి రావడం లేదు. గత ఏడాది మునుపెన్నడూ లేనంతగా నగరం ముంపునకు గురై ప్రజలు ఆగమాగమైనప్పటికీ బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో మళ్లీ అవే పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో వానకాలం ప్రారంభం కానుండగా, అధికారులు కంటి తుపుడుగా జేసీబీలతో నాలాల పూడిక తీయిస్తున్నారు.

వరంగల్ నగర ముంపునకు ప్రధాన కారణంగా నిలుస్తున్న బొందివాగు నాలాను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గతంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనలను అధికారులు పెడచెవిన పెట్టారు. అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని అన్ని ప్రాంతాల వరద సాకరాశికుంట నాలా ద్వారా, అమ్మవారిపేట చెరువు వరద నీరంతా బొందివాగు ద్వారా వెళ్తుంది. అయితే బొందివాగు అంతా ఆక్రమణకు గురికావడంతో వరద రోడ్డెక్కుతున్నది. అయితే అప్పుడే బొందివాగును సర్వే చేసి వాస్తవ హద్దులు నిర్ణయించి విస్తరించాలని సూచించినా బల్దియా అధికారులు పట్టించుకోలేదు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకోలేదు. బొందివాగు వరద ఉధృతి పెరిగితే భద్రకాళీ చెరువులోకి వదిలి కాపువాడ మత్తడి వైపు నుంచి బయటకు వదలాలనే ప్రతిపాదనను అప్పట్లోనే చేశారు.
ఇప్పటికీ ఆయా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. బొందివాగు నుంచి భద్రకాళీ చెరువులోకి వరద నీటిని వదిలేందుకు చేపట్టిన గేట్ల నిర్మాణ పనులు ఇంకా మొదలే కాలేదు. కాపువాడ వైపు మత్తడి వద్ద గేట్ల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఈ వానకాలం నాటికి అవి పూర్తయ్యే అవకాశాలు లేవని అధికారులే చెబుతున్నారు.

ఈసారి మళ్లీ అధిక వర్షాలు పడితే సాయినగర్, ఎన్టీఆర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, హంటర్ రోడ్డు ప్రధాన రహదారి మునగడం ఖాయంగా కనిపిస్తున్నది. దీనికి తోడు గతేడాది అలంకార్ జంక్షన్, రాయపుర లాంటి కాలనీలకు ఏర్పడిన ముంపు మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. దీనికి తోడు వరంగల్ స్టేషన్ రోడ్డు నుంచి వచ్చే వరద నీరు మేదరవాడ మీదుగా 12 మోరీలకు చేరుతుంది. అయితే వరంగల్ చౌరస్తా ప్రాంతంలోని వరద నీరు పోయే కల్వర్టులో మిషన్ భగీరథ పైప్‌లైన్ అడ్డుగా ఉండడం, మేదరి వాడ వద్ద అసంపూర్తిగా, ఎత్తుగా కల్వర్టు నిర్మించడడంతో నీరు సాఫీగా వెళ్లక ముంపు సమస్య తలెత్తుతున్నది.
అమ్మవారిపేట, భట్టుపల్లి, ఉర్సు చెరువుల నుంచి వచ్చే వరదంతా హంటర్‌రోడ్డు వద్ద బొందివాగులో కలుస్తుంది. అయితే బొందివాగులోకి వచ్చే నాలాలు పూర్తిగా పిచ్చి చెట్లతో నిండిపోయాయి. దీంతో భారీ వర్షం పడితే హంటర్రోడ్డుతో పాటు చుట్టూ ఉన్న కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. కేవలం తూతూ మంత్రంగా నగరంలోని కొన్ని నాలాల పూడికతీత పనులు చేపట్టి వరద నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు.