హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. సర్వే నంబర్ 50లోని ఆ 57.09 ఎకరాలు ప్రభుత్వ భూములేనని హైకోర్టు తీర్పు చెప్పింది.
ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులవని, ఒకొకరికి 3 ఎకరాల చొప్పున మ్యుటేషన్ చేయాలని గతంలో సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఆ భూముల్లో 38 ఎకరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామంటూ కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబసభ్యులతోపాటు మరో 2 సంస్థలు వేసిన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్పు చెప్పారు.