Vote | కౌంట్ డౌన్ మొదలైంది. ఐదు, నాలుగు, మూడు, రెండు.. ఒకటి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నది. పార్టీల ప్రచారం హోరెత్తుతున్నది. కొత్త ఓటరుకు కొత్త ప్రశ్న. పాత ఓటరుకు పాత ప్రశ్నే. ఎవర్ని గెలిపించాలి?
పాలను లీటర్లలో కొలుస్తాం. ప్రవాహాన్ని కూసెక్కులలో లెక్కిస్తాం. వస్ర్తాలను మీటర్లలో కొలుస్తాం. అస్ర్తాలను గురినిబట్టి గుర్తిస్తాం. ఓటుకు కొలమానం ఏమిటి?
హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడేవారు కొందరు. పత్రికల్లో వార్తలకే పరిమితమైన పేపర్ టైగర్స్ కొందరు. సీజన్‌కో పార్టీమారే ఊసరవెల్లులు కొందరు. ఉద్యమ స్ఫూర్తితో పనిచేసుకుపోయే కార్యసాధకులు కొందరు. ఎవరికి ఓటేయాలి?
దేవుడి పేరు చెప్పుకొనే పార్టీలు. ఓటర్లు ఇప్పటికే దేవుడి దగ్గరికి పంపిన పార్టీలు. ప్రజల్లో దేవుడిని చూసే పార్టీలు. ఏ పార్టీని ఎంచుకోవాలి?
రైట్ టు ఓట్ (ఓటు హక్కు) ఎంత ముఖ్యమో.. ఓట్ టు రైట్ (సరైన అభ్యర్థికి ఓటు) అంతే ప్రధానం. సమర్థుడికి వేసిన ఓటు.. ముత్యపు చిప్పలో పడిన వర్షపు బిందువు. అసమర్థుడికి వేసిన ఓటు అగాధంలో విసిరిన ఆణిముత్యం. సమర్థులెవరో, అసమర్థులెవరో గుర్తించడం ఎలా?
వ్యక్తిని కాదు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. పార్టీని కాదు, అభివృద్ధిని అందలమెక్కించండి. పార్టీ మ్యానిఫెస్టోతోపాటు అభ్యర్థి గత చరిత్రనూ గమనించండి. అధినేత గుణగణాలు తెలుసుకోండి. ఆ తర్వాతే తుది నిర్ణయం. ఆ బేరీజులో ఉపకరించే చెక్‌లిస్ట్ మీ ముందు ఉంచుతున్నాం. ఇదొక ప్రజాస్వామ్య పెద్దబాల శిక్ష. ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో సూచిస్తుంది. ఇదొక ఎన్నికల దిక్సూచి. ఏ పార్టీ దిశగా వెళ్లాలో వివరిస్తుంది. ఇదొక ఓటింగ్ ఎక్కాల పుస్తకం. రెండు ఒకట్లు రెండు కావచ్చు. కానీ ఒక్క ఓటును.. వంద అంశాలు ప్రభావితం చేసే తీరునువిశ్లేషిస్తుంది.
The leader is the one who knows the way, goes the way, and shows the way.
– John C. Maxwell
ఎవరా నాయకుడు? జనంలోంచి పుట్టుకొచ్చాడా? అధిష్ఠానాలు రిమోట్ నొక్కితే వచ్చాడా? అతని మాటలు గుండెల్లోంచి పెల్లుబికి వస్తున్నాయా? ఎవరో రాసిన స్క్రిప్ట్ వల్లెవేస్తున్నాడా? ఆ నాయకుడి వెనకున్న నావికుడు ఎవరు? .. అన్నీ ఆరాతీయాలి.
ఎన్నికల రణరంగంలో నాయకుడి పాత్రే కీలకం. అతను పార్టీని నడిపిస్తాడు. కాదుకాదు పరుగెత్తిస్తాడు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తాడు. ప్రత్యర్థులను పదునైన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. ఓటరు నాడి పట్టుకుంటాడు. వినూత్న శైలిలో తనవైపు తిప్పుకొంటాడు. సుడిగాలిలా పర్యటిస్తాడు. వాగ్ధాటితో మెప్పిస్తాడు. వాగ్దానాల వర్షం కురిపిస్తాడు. చేసింది చెబుతాడు. చేయబోయేది వివరిస్తాడు. పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్తాడు. మొత్తంగా అతనో సమ్మోహక శక్తి. అతడి బలాబలాల బేరీజుతో.. సగానికి సగం స్పష్టత వచ్చేస్తుంది. ఆ మదింపులో ప్రశ్నను మించిన మార్గం లేదు. స్పష్టత వచ్చేవరకూ ప్రశ్నిస్తూ వెళ్లడమే.
నాయకుడికి నేపథ్యమే పునాది. అడ్డదార్లు తొక్కుతూ వచ్చాడా.. తనకంటూ ఓ రహదారి నిర్మించుకుని వచ్చాడా? అన్నది చూడాలి.
అతని రాజకీయ చరిత్ర ఎలాంటిది? సకల జనుల ఆకాంక్షల ముందు.. పదవులు, హోదాలు తృణప్రాయమని భావించి.. రాజీనామాకు సిద్ధపడిన రాజీలేని నాయకుడా? జనాభిప్రాయంతో సంబంధం లేకుండా పదవుల వృక్షాన్ని పట్టుకు వేలాడే గబ్బిలాల వారసుడా? కనిపెట్టండి. గురిపెట్టండి.
జనం కోసం ఉద్యమాలు చేశాడా? ప్రజల గుండెచప్పుడుకు అనుగుణంగా పోరుబాటలో నడిచాడా? బలమైన ఉద్యమాన్ని నిర్మించాడా? ఆమరణ దీక్షతో.. దక్షత చాటుకున్నాడా? తెలంగాణ వ్యతిరేక శక్తుల మెడలు వంచాడా? ఢిల్లీ నేతల్ని కదిలించాడా? జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాడా? అనుకున్నది సాధించాడా? లేదంటే.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలోనూ.. తెలంగాణ వ్యతిరేకులకు ఊడిగం చేస్త్తూ బతికేశాడా? గుర్తించండి. గమనించండి. చరిత్ర వెలికితీయండి.
నాయకుడి వ్యక్తిత్వం మచ్చలేనిదై ఉండాలి. నిజాయతీకి అతను నిలువుటద్దం కావాలి. ప్రతి నిర్ణయం వెనుకా ప్రజా సంక్షేమమే ఉండాలి. ప్రతి అడుగూ జన సమూహం వైపే పడాలి. మరి, ఆ పార్టీ అధ్యక్షుడు ఎలాంటివాడు?
తెలంగాణ ప్రయోజనాలే తన పరమావధి అయినవాడు.. తెలంగాణ ప్రజలే తన హైకమాండ్ అని చెప్పగలిగే ధైర్యం ఉన్నవాడు.. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలూ కుతంత్రాలను నిలువరించే తెగువ కలిగినవాడు.. ఏ పార్టీకి అధ్యక్షుడైతే, ఆ పార్టీని నిస్సందేహంగా విశ్వసించవచ్చు.
జెండా ఒకటి. అజెండా మరొకటి. పుట్టిన పార్టీ ఒకటి. ఆశ్రయించిన పార్టీ మరొకటి. నినాదం ఒకటి. విధానం మరొకటి. రోబో లీడర్ ఇక్కడ ఉంటాడు. రిమోట్ కంట్రోల్ పొరుగు రాష్ట్రంలో ఉంటుంది. అలాంటి ఓట్లు-నోట్లు-రేట్ల బేహారులు మనకెందుకు? బీఫారమ్కు కూడా రేటు పెట్టి పార్టీని కోళ్ల ఫారమ్లా మార్చేసే పొలిటికల్ బిజినెస్మెన్లతో మనకేం పని? సాక్ష్యాలతో సహా దొరికిపోయిన.. కట్లపాములకు ఓట్ల పాలుపోసి పెంచుతామా? ఆలోచించండి. డ్రైనేజీ గుంతలు, రహదారుల గతుకులు, ట్రాఫిక్ సమస్యలతో ముడిపెట్టి చూడాల్సిన సమయం కాదిది. ఆ మాటకొస్తే.. అభ్యర్థికి
అతీతంగా .. అధ్యక్షుడి విశ్వసనీయతే కొలమానం ఇక్కడ.
అధ్యక్షుడు సారథి అయితే, పార్టీ రథం. మ్యానిఫెస్టోలోని అంశాలు సప్తాశ్వాలు. పార్టీ సిద్ధాంతాలు రథచక్రాలు. పార్టీ మూలాలే విజయ ధ్వజాలు. ఆ పార్టీ ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది? అనే కోణంలోనూ ఆలోచించాలి.
బీఆర్ఎస్.. నూటికి నూరుశాతం ఉద్యమ పార్టీ. పోరాటమే తన పంథా అని ప్రకటించుకున్న పార్టీ. ఒక్కడితో మొదలై.. లెక్కకు మిక్కిలి ప్రజాసైన్యంతో తెలంగాణ నలుదిక్కులావిస్తరించింది. స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం.. లాఠీ దెబ్బలు తిన్నది. జైలుకెళ్లింది. ఊచలు లెక్కబెట్టింది. తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచింది. పదవుల్ని గడ్డిపోచలా భావించింది. అదే గడ్డిపోచల్ని ఏకం చేసి మదపు టేనుగును బంధించింది. రాజీనామాలతో జనక్షేత్రానికి వెళ్లింది. ఎక్కడా రాజీలేదు. ఏ విషయంలోనూ మడమతిప్పలేదు. పార్టీ అంటే అలా ఉండాలి!
తొలిదశ తెలంగాణ ఉద్యమం గొంతునొక్కిన ఓ జాతీయ పార్టీ.. తెలంగాణ పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నది. విఫల ప్రయత్నాలు చేస్తున్నది. వందేండ్లు నిండిన ఆ పార్టీని ప్రధాన రాష్ర్టాలన్నీ బొందబెట్టాయి. కాస్తంత దయచూపిన కన్నడిగులది ఇప్పటికే కన్నులొట్టబోయిన పరిస్థితి. ఐదారు నెలల్లోనే ఐదేండ్ల నరకం చూపిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలతో ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నారు. దేశమంతా వద్దనుకున్న గద్దల పార్టీ మనకు మాత్రం ఎందుకు? ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న పార్టీకి తెలిసిందల్లా ఒకటే.. జనాన్ని విభజించి.. దేశాన్ని భుజించడం. రాజకీయ ఉద్యోగాల కోసం ఉద్వేగాలను రెచ్చగొడతారు. దేశ సరిహద్దులు మొదలు మారుమూల పల్లెల వరకు.. ఏ అవకాశం వచ్చినా వదలరు. ఏ అవకాశమూ రాకపోయినా కృత్రిమంగా సృష్టించుకుంటారు. తమ కనుసన్నల్లో మెలిగే పారిశ్రామికవేత్తల సంపద పెంచడమే వీళ్ల ఆర్థిక విధానం. ఎన్నికల సమయానికి సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను పెంచి పోషించడమే వీళ్ల విదేశాంగ విధానం. బలహీనమైన ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలో పాగా వేస్తారు. చీమలు పెట్టిన పుట్టలను పాములు మింగేసినట్టు.. నయానో భయానో అధికారం చేజిక్కించుకుంటారు. ఇదొక విషవృక్షం. అదొక రక్తబీజుడి సంతతి. మొదట్లోనే కట్టడిచేయాలి. నిర్దాక్షిణ్యంగా తరిమేయాలి. మన రాష్ట్రం. మన పార్టీ. మన అధినాయకుడు. మన ఆత్మాభిమానం.
నాయకుడంటే.. బంధుత్వం లేని చుట్టం. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టని స్నేహితుడు. మీ ఇంటిముందు మురుగు పారితే పరుగుపరుగున వస్తాడు. మీ కాలనీలో రౌడీమూకలు చెలరేగితే కళ్లెర్రజేస్తూ కారు దిగుతాడు. మీ జాగాను కబ్జాదారులు చెరబడితే.. ఆ దగాకోరుల ఆటకట్టిస్తాడు. అందుబాటులో ఉంటాడు. అందరివాడు అనిపించుకుంటాడు. అధినేతకు విధేయుడిగా, పార్టీకి ప్రతినిధిగా నియోజకవర్గాన్ని పాలిస్తాడు, ప్రేమిస్తాడు. ముఖ్యమంత్రిని మెప్పించి, ఒప్పించి నిధులు మంజూరు చేయించుకుంటాడు. అధికారుల్ని సమన్వయపరిచి ప్రతిపైసా సద్వినియోగం అయ్యేలా జాగ్రత్తపడతాడు. నాణ్యత విషయంలో రాజీపడడు. దవాఖానలు, ప్రభుత్వ పాఠశాలలు, సర్కారీ కార్యాలయాలు తరచూ ఆకస్మిక తనిఖీ చేస్తాడు. లోపాలు సరిదిద్దుతాడు. నియోజకవర్గాన్ని కడిగిన ముత్యంలా తీర్చిదిద్దుతాడు. అచ్చంగా అలాంటి అభ్యర్థినే గెలిపించండి. ఒక్కసారి అతని గత చరిత్రా చూడండి.
పార్టీ అధినేత అత్యుత్తమ పాలకుడు అయినప్పుడు.. అభ్యర్థిలోని చిన్నచిన్న లోపాలను విస్మరించినా తప్పులేదు.
మ్యానిఫెస్టో.. ఒక వాగ్దానం. త్రికరణ శుద్ధిగా చేసే ప్రమాణం. ఓటరుకు భరోసా. అందులో నాయకుడి విజన్ ఉంటుంది. పార్టీ కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. మహిళల మనోగతం, నిరుద్యోగుల ఆశలు, రైతుల కలలు, శ్రామికుల స్వప్నాలు, ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లు.. అన్నీ కలగలిసి ఉంటాయి. అది ఆకలితీర్చే అన్నం గిన్నె. నోరు తీపిచేసే మిఠాయి పొట్లం. అందమైన రేపటికి అక్షర సాక్ష్యం. మ్యానిఫెస్టోను ఒక బాధ్యతగా భావించే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లాంటి పార్టీలు అతి తక్కువ. కేసీఆర్ గత ఎన్నికల మ్యానిఫెస్టోను నూటికినూరు శాతం అమలు చేశారు. మ్యానిఫెస్టోలో ప్రకటించని పథకాలూ అమలు చేశారు. సైకిల్ కొనిస్తానని మాటిచ్చి.. బ్రాండ్ న్యూ బైక్ కానుకగా ఇచ్చే కన్నతండ్రి మనస్తత్వం ఆయనది. కానీ అందరూ అలా ఉండరు. అన్ని పార్టీలకూ అంత ఔదార్యం ఉండదు.
కొందరికి.. మ్యానిఫెస్టో ఓ తెప్ప, ఎన్నికలు అయిపోగానే తగలబెట్టేస్తారు. ఆ విన్యాసాలు సర్కారు ఏర్పాటు కోసం చేసే పీసీ సర్కార్ గారడీలు. కచ్చితమైన అంచనాలు ఉండవు. శాస్త్రీయమైన అధ్యయనం కనిపించదు. యథాతథంగా అమలు చేస్తే మాత్రం.. ఖజానా ఖాళీ. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమే. ఇలాంటి టక్కుటమార విద్యలలో వందేండ్ల పార్టీ ఆరితేరింది. ఇప్పటికే కన్నడ సీమలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక.. నిండుకున్న ఖజానాను నింపుకోలేక పాలకులు బిక్క మొహం వేస్తున్నారు. నక్కజిత్తులు పన్నుతున్నారు. మరొక జాతీయ పార్టీ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివింది. కాబట్టి, ప్రతి పార్టీ మ్యానిఫెస్టోనూ పరిశీలించండి. ఆ వాగ్దానాలను గమనించండి. సాధ్యాసాధ్యాలను బేరీజు వేయండి. క్షీరనీర న్యాయం తెలిసిన రాయంచలా.. చిత్తశుద్ధి ఉన్న పార్టీకి, చెత్త బుద్ధి ఉన్న పార్టీకి తేడాను గమనించండి. మంచినే గెలిపించండి.
అంకెలతో పన్లేదు. బడ్జెట్ వివరాలతో నిమిత్తం లేదు. చట్టసభ చర్చల్లో ఎవరో బల్లగుద్ది చెప్పాల్సిన అవసరమూ లేదు. అభివృద్ధి కళ్లకు కనిపించాలి. మనసుకు అర్థం కావాలి. ఆ సానుకూల మార్పు జీవితాల్ని ప్రభావితం చేయాలి. బతుకుల్ని మెరుగుపరచాలి. నిన్నలేని అందమేదో నేడు సాక్షాత్కరించాలి. అంతే. అప్పుడెట్లుండె తెలంగాణ. ఇప్పుడెట్లయింది తెలంగాణ. ఎండిన గొంతులు తడుస్తున్నయ్. మిషన్ భగీరథే సాక్ష్యం. నెర్రెలు బారిన నేలలు మాగాణాలు అవుతున్నాయి. కాళేశ్వరమే ఆధారం. సేద్యగాడికి అప్పుల కష్టం తప్పింది. రైతుబంధు ఆత్మీయ బంధువు. ఆడపిల్ల తండ్రికి అప్పుల తిప్పల్లేవు. కల్యాణలక్ష్మి కటాక్షించింది. ఒకటా రెండా.. అనేక పథకాలు.
జనవాక్కు బ్రహ్మవాక్కు. తిరుగులేదు. పూలమ్ముకునేవారు, పాలమ్ముకునేవారు, శ్రామికులు, ఆటో డ్రైవర్లు, విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు, తటస్థులు.. ప్రతి ఒక్కరినీ పలకరించండి. వివిధ రాజకీయ పార్టీలపై వారి అభిప్రాయం తెలుసుకోండి. వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకున్నవారితో సంభాషించండి. ఇవన్నీ ప్రాథమికంగా ఓ అంచనాకు రావడానికి ఉపకరిస్తాయి. అదే సమయంలో, సామాజిక మాధ్యమాల్లో తారసపడే ప్రతి సమాచారమూ నిజమని భ్రమపడకండి. ఫేక్‌న్యూస్, డీప్‌ఫేక్ వీడియోస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విష ప్రచారాలు, నేలబారు భాషలు, విశ్వాసాల్ని కించపరిచే వక్రీకరణలు.. ఇలా భావ కాలుష్యాన్ని వెదజల్లే వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ బృందాలను సాధ్యమైనంత దూరం పెట్టండి. వినదగునెవ్వరు చెప్పిన.. ఫార్ములాను పాటించండి. అంతిమ నిర్ణయం మీరే తీసుకోండి. అంతరాత్మ ప్రబోధం ప్రకారమే నడుచుకోండి.
‘సాధించింది ఎంతో ఉంది. సాధించాల్సింది ఇంకా ఉంది’ అని సగర్వంగా చెబుతున్నది బీఆర్ఎస్. తాను చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్న ధైర్యం పార్టీ శ్రేణులలో బలంగా కనిపిస్తున్నది. ఐదు దశాబ్దాలు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించినా సాధించింది ఏమీ లేదు కానీ.. ఆరు ఉత్తుత్తి పథకాల తోక పట్టుకుని.. గెలుపు గోదారి ఈదాలని ప్రయత్నిస్తున్నది ఓ అంతరించిపోతున్న పార్టీ. ఇక్కడైతే పదేండ్ల నుంచీ జనం పట్టించుకోవడం మానేశారు సరే.. గెలిచిన చోటైనా కించిత్ అభివృద్ధి సాధించారా అంటే.. అదీ లేదు. కప్పాల గొడవలు, కప్పల తక్కెడ బేరాలతోనే పుణ్యకాలమంతా గడిచిపోతుంది. ఓటేసిన పాపానికి సామాన్యులు నరకం అనుభవిస్తారు. ఏ రాష్ట్రంలో అయినా ఇదే భస్మాసుర హస్తం కథే. మొత్తంగా దేశాన్ని పాలించిన రోజుల్లో కూడా అవినీతి కేసులు, పచ్చనోట్ల సూట్ కేసులే! భ్రమలు కల్పించో, ఉద్వేగాలు రెచ్చగొట్టో, జాలి కలిగేలా యాచించో, మనసు మార్చుకునేలా ప్రలోభపెట్టో పబ్బం గడుపుకోవాలనుకునే వారికి కూడా సబ్బండ వర్గాలన్నీ కలిసి బలమైన హెచ్చరిక చేయాలి.
మొన్నటితో నిన్నటిని.. నిన్నటితో నేటిని సరిపోల్చుకుని.. అభివృద్ధిని నిర్ధారించుకుని.. సరైన పార్టీనే ఎన్నుకోవాలి. తెలంగాణ భవితకు మన ఓటుతో భరోసా ఇవ్వాలి.
ప్రతి ఎన్నికా గొప్పదే. కానీ కొన్ని ఎన్నికలు మరింత కీలకమైనవి. మొత్తంగా ఓ జాతి ప్రయోజనాలతో ముడిపడినవి. కుటుంబ చరిత్ర, పెరిగిన వాతావరణం, బంధుగణం, స్నేహితుల ప్రభావం.. ఇలా రకరకాల కారణాలతో మనం వివిధ రాజకీయ పార్టీలను అభిమానిస్తాం. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అభ్యర్థితో నిమిత్తం లేకుండా, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోకుండా ఆ పార్టీకే ఓటేస్తాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎవరి అభిప్రాయాన్నీ తప్పు పట్టలేం. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఆ మూసలోంచి బయటికి రావాలి. రాష్ట్ర ప్రయోజనాల్ని, ఉద్యమ పార్టీ గెలవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా జాగ్రత్తపడాలి. అందులోనూ, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఓ కీలకమైన మజిలీలో ఉన్నది. పదేండ్ల ప్రగతికి, యాభై ఏండ్ల దుర్గతికి మధ్య యుద్ధమిది.
స్వరాష్ట్రం తెచ్చినవారికి, స్వాభిమానం చచ్చినవారికి మధ్య పోరాటమిది. పసి రాష్ర్టాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కసి ప్రత్యర్థుల కళ్లలో కనిపిస్తున్నది. ఢిల్లీలో కత్తులు నూరుకునే పార్టీలు ఇక్కడ మాత్రం కనిపించని పొత్తులు చేసుకుంటున్నాయి. జిత్తులు ప్రయోగిస్తున్నాయి. వాటిని చిత్తు చేయడానికైనా.. ఓటర్లు స్తబ్ధత వీడాలి. జాతీయ పార్టీల ఉమ్మడి ప్రత్యర్థి.. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి.
ఎన్నికలు అనగానే రకరకాల ఊరింపులు ఉంటాయి. నోట్లు పంచేవారు, మద్యం పారించేవారు, కుక్కర్లు, స్పోర్ట్స్ కిట్లు, గడియారాలు.. రకరకాల బహుమతులతో మన మతి తప్పించాలని ప్రయత్నించేవారు.. చాలా మందే ఉంటారు. మీ కులం, మీ మతం, మీ ప్రాంతం.. అంటూ దురభిమానాన్ని పోషించేవారూ లెక్కలేనంత మంది. ఆ ప్రలోభాలు, ప్రభావాలను సాధ్యమైనంత దూరం ఉంచాలి. ఒక్కసారి అమ్ముడుపోయామంటే.. ఎవరో వచ్చి రాష్ర్టాన్ని అమ్ముకుపోతున్నా ప్రశ్నించే నైతిక హక్కు మనకు ఉండదు. చివరికి మన ఆస్తుల్ని కబ్జా చేస్తున్నా, మన పనులు చేసిపెట్టడానికి లంచం అడుగుతున్నా.. ఎదురుతిరగలేని ఆత్మన్యూనత మనల్ని వెంటాడుతుంది. సమర్థత ఆధారంగానే ఓటువేయండి.బాధ్యత కలిగిన ఓటరుగా, వాస్తవాలు తెలిసిన ఉన్నత విద్యావంతుడిగా.. తోటి ఓటర్లకు కర్తవ్యదీక్షోపదేశం చేయండి.
* * *
నవంబరు 30 గుడికెళ్లినంత ప్రశాంతంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లండి. అవును. క్యూ పెద్దగానే ఉండవచ్చు. మీ ఇష్టదైవం దర్శనానికి వెళ్లినప్పుడు అంతకంటే పదింతలు పెద్ద వరుసలో నిలుచున్న విషయం గుర్తు చేసుకోండి. ఆలయానికి అగరొత్తులతో, కొబ్బరికాయతో వెళ్లినట్టు.. ఓటర్ ఐడీ, ఓటర్ స్లిప్ తీసుకెళ్లండి. సెల్‌ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్తేనే మంచిది. ఆ వరుసలో మీ ముందు నిలబడిన వ్యక్తితోనో, వెనుక నిలబడిన మనిషితోనో చర్చలు, వాదనలు వద్దు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ప్రచారాలు, ప్రలోభాలు జరుగుతున్నట్టు అనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. మీ వంతు రాగానే.. పోలింగ్ యంత్రం దగ్గరికి వెళ్లండి. తెలంగాణ గుండెచప్పుడు వినిపించే పార్టీకే ఓటేయండి. పౌరుడిగా మీరు గెలిచారు. అభినందనలు.