హనుమకొండ చౌరస్తా, జనవరి 4: చారిత్రిక వేయిస్తంభాల దేవాలయంలో కొలువైన రుద్రేశ్వరుడు మహాన్వితాశక్తి కలిగిన దేవుడని అందుకోసమే పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ దేవాలయాన్ని సందర్శించానని హనుమకొండ జిల్లా న్యాయమూర్తిగా పనిచేసి పదోన్నతిపై రాష్ర్ట అవినీతి నిరోధక శాఖ న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన టి.పట్టాభిరామారావు అన్నారు. ఆయన వారి కూతురితో కలిసి ఆదివారం దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతంపలికి ఉత్తిష్ట గణపతికి దర్శనం కల్పించి రుద్రేశ్వరస్వామికి వారి గోత్రనామాలతో మారేడు దళములతో పుష్పములతో మహాఅర్చన నిర్వహించారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో వారికి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలు అందించి వేదఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేవాలయంలో ఆ రుద్రేశ్వరుని దర్శించుకున్న వారు అభిషేకించుకున్న వారు ఎంతోమంది న్యాయమూర్తులు రాష్ర్టస్థాయిలో పదోన్నతలు పొందారన్నారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి.అనిల్ కుమార్ స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేందర్‌శర్మ, అర్చకులు పెండ్యాల సందీప్‌శర్మ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. వారి వెంట జిల్లా న్యాయస్థాన సిబ్బంది ఉన్నారు.