Papaya | మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. ఇది మనకు అన్ని కాలాల్లో చాలా తక్కువ ధరలో లభిస్తుంది. బొప్పాయి పండు పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఈ పండు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మలేరియా జ్వరంతో బాధపడే వారు బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బరువు తగ్గడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో, బరువును అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా బొప్పాయి పండు మనకు సహాయపడుతుంది. బొప్పాయి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు కలుగుతుందనే వివరాలను పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
బొప్పాయి పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. బొప్పాయి పండులో విటమిన్ ఎ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి కూడా బొప్పాయి పండు ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మంపై ముడతలు తగ్గుతాయి. వృద్దాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. స్త్రీలల్లో వచ్చే నొలసరి నొప్పులను తగ్గించడంలో బొప్పాయి పండు అద్భుతంగా పని చేస్తుంది. నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడే స్త్రీలు క్రమం తప్పకుండా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల నొప్పి క్రమంగా తగ్గుతుంది. బొప్పాయి పండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలల్లో ఇది ఒకటి. బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయం నుండి రక్తం సజావుగా బయటకు వెళ్లడంలో సహాయపడుతుంది.
శరీరంలో రోగనిరోధక శక్తినిపెంచడంలో కూడా బొప్పాయి పండు మనకు దోహదపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి అనారోగ్య సమస్యలను, ఇన్పెక్షన్ లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజుకు బొప్పాయి పండు ఒక సర్వింగ్ ను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్ సి కంటే 200 శాతం ఎక్కువగా అందుతుంది. కనుక బొప్పాయి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు బొప్పాయి పండులో అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల రక్తప్రవాహం మెరుగుపడుతుంది. ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ పండు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో కూడా దోహదపడుతుంది. కనుక బొప్పాయి పండును తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మలబద్దకంతో బాధపడే వారు బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో ఉండే ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడంతో పాటు పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా బొప్పాయి పండు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.